Premabhishekam 45 Years అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన సినిమాలలో ‘ప్రేమాభిషేకం’ ఒకటి. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. విడుదలై నేటికి (ఫిబ్రవరి 18) సరిగ్గా 45 ఏళ్లు పూర్తయింది. ప్రేమ, త్యాగం మేళవింపుగా సాగే ఈ ప్రేమకథ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఈ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ ఓ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ప్రేమకథా చిత్రాలలో ‘ ప్రేమాభిషేకం ‘ ఒకటి. దివంగత లెజండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన ఈ సినిమా, టాలీవుడ్ లో విషాదాంత ప్రేమకథలకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది.. నూతన ఒరవడిని సృష్టించింది. దశాబ్దాలు గడిచినా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. నేటికి ఈ సినిమా వచ్చి సరిగ్గా 45 ఏళ్లు పూర్తయింది.
‘ప్రేమాభిషేకం’ సినిమాలో నాగేశ్వరరావు, జయసుధ, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్డూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున, వెంకట్ నిర్మించారు. 1981 ఫిబ్రవరి 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలై నలభై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అన్నపూర్ణ స్డూడియోస్ సంస్థ ఓ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది.
ప్రేమాభిషేకం’ 45 అద్భుతమైన సంవత్సరాలను సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ చారిత్రాత్మక బ్లాక్ బస్టర్ సృష్టించిన రికార్డులు, ఎమోషన్స్, ఇంపాక్ట్ నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. లక్షలాది హృదయాలలో లెజెండరీ ఏఎన్నార్ గారి లెగసీ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది” అని అన్నపూర్ణ స్డూడియోస్ నిర్మాణ సంస్థ పేర్కొంది. ”ప్రేమతో మొదలైన ప్రయాణం.. తన బాధను దాచుకొని ఆమె ఆనందం కోసం బ్రతికిన మనసు.. ప్రేమకు అర్థం చెప్పిన కథ.. త్యాగానికి రూపం చూపిన మనసు.. 45 సంవత్సరాల ‘ప్రేమాభిషేకం’ ఎప్పటికీ ఎవరు గ్రీన్ క్లాసిక్ అని తెలిపారు. సినిమాలోని ఐకానిక్ సీన్స్, క్లాసిక్ సాంగ్స్ తో రూపొందించిన ఈ వీడియో ఆకట్టుకుంటోంది.
‘ప్రేమాభిషేకం’ కథాంశం విషయానికి వస్తే.. ఇది హృదయాన్ని హత్తుకునే త్యాగపూరిత ప్రేమకథ. కథానాయకుడు రాజేష్ (ఏఎన్నార్) తనకు సోకిన క్యాన్సర్ వ్యాధి కారణంగా, తాను ప్రేమించిన దేవి (శ్రీదేవి)కి దూరమవ్వాల్సి వస్తుంది. తను చనిపోయాక తన ప్రేమికురాలు బాధపడకూడదని, ఆమె తనను అసహ్యించుకుని మరొకరిని పెళ్లి చేసుకోవాలని రాజేష్ చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేస్తాయి. ఈ క్రమంలో జయసుధ పాత్ర ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథను మరిన్ని మలుపులు తిప్పుతుంది. ప్రేమ, త్యాగం, వేదనల కలబోతగా సాగే ఈ కథ ప్రేక్షకులను కట్టిపడేసింది.
‘ప్రేమాభిషేకం’ సినిమాలో ప్రధాన పాత్రధారుల నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తన నటనతో ఈ చిత్రానికి ప్రాణం పోశారు. ప్రాణాంతకమైన వ్యాధి సోకిన బాధితుడిగా ఆయన చూపించిన హావభావాలు, క్లైమాక్స్ సన్నివేశంలో ఆయన అభినయం అద్వితీయం. దివంగత నటి శ్రీదేవి తన అందం,అభినయంతో దేవి పాత్రలో ఒదిగిపోయారు. జయసుధ తన పరిణతి చెందిన నటనతో ఆకట్టుకున్నారు. శ్రీదేవి, జయసుధ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. మోహన్ బాబు, మురళీ మోహన్, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, పద్మభూషణ్ తదితరులు ఎవరి పాత్రల్లో వారు అద్భుతమైన నటన కనబరిచారు.
దర్శకుడు దాసరి నారాయణరావు రాసిన ఎమోషనల్ లవ్ స్టోరీ, ఆలోచింపజేసే శక్తివంతమైన డైలాగ్స్.. సగటు ప్రేక్షకుడి మనసును తట్టేలా ఉంటాయి. చక్రవర్తి అందించిన సంగీతం ఈ సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచింది. ఈ సినిమా పాటలు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోయాయి. “నా కళ్లు చెబుతున్నాయి”, “ఆగదు ఆగదు ఈ నిమిషం”, “వందనం అభివందనం”, ”ఒక దేవుని గుడిలో” వంటి పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. ప్రతీ పాట సందర్భానుసారంగా ఉంటూ, కథలోని భావోద్వేగాలను రెట్టింపు చేస్తుంది.
రికార్డుల పరంగానూ ‘ప్రేమాభిషేకం’ చరిత్ర సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో 365 రోజులకుపైగా ప్రదర్శితమై, అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 25 సెంటర్లలో నేరుగా 100 రోజులు పూర్తి చేసుకుంది. 16 సెంటర్లలో 175 రోజులు ఆడింది. ఆంధ్రప్రదేశ్‌లోని 2 సెంటర్లలో 750 రోజులు ప్రదర్శించబడింది. బెంగళూరులో 75 వారాలు ప్రదర్శింపబడిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఒక విషాదాంత కథను ప్రేక్షకులు ఇంతలా ఆదరిస్తారని ‘ప్రేమాభిషేకం’ నిరూపించింది. కాలం మారుతున్నా, టెక్నాలజీ పెరుగుతున్నా, తెలుగు సినిమా గౌరవాన్ని పెంచే ఇలాంటి మరపురాని చిత్రాలు ఇచ్చే అనుభూతి మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమనే చెప్పాలి.
ప్రేమకు నిర్వచనం…
త్యాగానికి ప్రతీక…
సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన ప్రేమాభిషేకం ❤️🔥Celebrating 4️⃣5️⃣ glorious years of #Premabhishekam, a historic blockbuster whose records, emotions and impact remain untouched even today✨
A timeless legacy of the legendary #ANR garu that… pic.twitter.com/Ifcorr71DG
— Annapurna Studios (@AnnapurnaStdios) February 18, 2026
