Anil Ravipudi Love Story : టాలీవుడ్‌లో 100% సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)..తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) తో మరో బిగ్ బ్లాక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అద్భుతమైన హాస్యభరితమైన కథనాలతో ప్రేక్షకులను మెప్పించే ఆయన వ్యక్తిగత జీవితం కూడా ఫన్నీ మూమెంట్స్‌తో నిండిపోయిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇండస్ట్రీలోకి రాకముందు అనిల్ ఒక సాధారణ ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉండేవారని, అప్పట్లో సినిమాలపై ఉన్న ఆసక్తే ఆయన జీవితాన్ని కొత్త మలుపు తిప్పిందని చెప్పుకొచ్చారు.
‘ఛలో తిరుపతి’ జాతకాన్ని మార్చేసింది
సినిమాల్లోకి రాకముందే అనిల్ రావిపూడి ‘ఛలో తిరుపతి’ అనే పేరుతో ఓ స్కిట్ రాసి దానికి దర్శకత్వం వహించారు. అద్దంకిలో జరిగిన ఓ కార్యక్రమంలో రఘుబాబు, శ్రీనివాసరెడ్డి నటించిన స్కిట్‌ను చూసిన తర్వాత తాను కూడా ఓ కొత్త స్కిట్ రూపొందించాలని అనుకున్నానని, ఆ స్కిట్‌కి వచ్చిన ప్రశంసలే తన భవిష్యత్తును నిర్ణయించాయని అన్నారు. విజ్ఞాన్ కాలేజీలో బీటెక్ చదివిన రోజుల్లో క్లాసులకు తక్కువగా వెళ్లేవాడినని, అయితే ఆ స్కిట్ వల్ల తనకు కాలేజీలో గుర్తింపు పెరిగిందని తెలిపాడు. అదే సమయంలో తన భవిష్యత్ కంప్యూటర్ ముందు కూర్చొని కోడింగ్ చేయడం కాదని, కళామతల్లే తన గమ్యం అని భావించాడట.
భార్గవితో ఫ్రెండ్ షిప్ – లవ్
అనిల్ రావిపూడి భార్య భార్గవి, బీటెక్ క్లాస్‌మేట్. ‘ఛలో తిరుపతి’ స్కిట్ తర్వాత మీము మంచి ఫ్రెండ్స్ అయ్యారని, తర్వాత అది ప్రేమగా మారిందని తెలిపాడు. ఇంతకుముందు తనకు అమ్మాయిలతో పెద్దగా పరిచయాలు లేవని, స్కిట్ వల్ల తనకు కొంతమంది కొత్త స్నేహితులు ఏర్పడ్డారని, వారిలో భార్గవి కూడా ఉన్నారని అన్నారు. అప్పట్లో తన చెప్పిన కథలను భార్గవి ఎంతో నమ్మేదని, ఇప్పుడు కూడా మరింత నమ్ముతోందని అనిల్ ఫన్నీగా చెప్పుకొచ్చారు. తనకు సినీ పరిశ్రమపై ఉన్న ప్రేమే జీవితంలో మార్గదర్శకంగా మారిందని, అదే తన వ్యక్తిగత జీవితం, ప్రేమకూ ప్రేరణనిచ్చిందని పేర్కొన్నాడు.