Congress Leaders Reaction: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో ప్రస్తావించారు. కాస్త ఘాటుగానే మాట్లాడారు. ఈ మాటలకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టి సీఎం చేసిన వ్యాఖ్యలు అవాస్తవం అనే చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో ఈ వివాదం కాస్త పెద్దది అవుతోంది. బన్నీ వ్యాఖ్యలపై తాజాగా కాంగ్రెస్ (Congress Leaders Reaction) ఎంపీ చామల, ఎమ్మెల్సీ బల్మూరి స్పందించారు.
ఎంపీ చామల కామెంట్స్ ఇవే
పుష్ప-2 సినిమా కోసం సంధ్య థియేటర్‌లో జరిగిన సంఘటన గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ హడావుడిగా ఒక ప్రెస్ మీట్‌లో ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తారనుకున్నాం. ప్రెస్ మీట్ చూస్తే రియల్ హీరోగా కాకుండా రీల్ హీరోగా ప్రవర్తించిన తీరు కనబడుతుంది. మీరు మూడు సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా నష్టం జరగొద్దనే ఉద్దేశంతోనే టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం ఒప్పుకుంది. రానున్న రోజులలో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బెనిఫిట్ షోలకు పర్మిషన్ కూడా ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆరోజు సంధ్య థియేటర్‌లో మీరు సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చింది. అంతా గందరగోళంగా ఉంది. ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదు. మీకు సినిమా కలెక్షన్ల మీద ధ్యాస ఉంది తప్ప.. ప్రజలు ఏమైతున్నారు.. బయట ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదు. మీరు రియల్ హీరోగా మాట్లాడలేదు స్క్రిప్టు తీసుకొచ్చి చదివిన విధంగా ఉంది. ప్రజలకు ఏం సంజాయిషీ ఇస్తారో మీకే క్లారిటీ లేదు. నిన్నటి ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన తీరు ఒక బాధ్యతయుతంగా ఉండాలి. కానీ ప్రజలను నష్టపరిచే విధంగా ఉండొద్దు. నా క్యారెక్టర్ ను దెబ్బతీశారు అనడం విడ్డూరంగా ఉంది. సినిమాలోనే హీరో కాదు బయట కూడా హీరోలాగా వివరించాలని బన్నీకి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు.
Also Read: PM Modi Letter To Ashwin: అశ్విన్ రిటైర్మెంట్.. ప్రధాని మోదీ భావోద్వేగ లేఖ!
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కామెంట్స్
అయితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన అల్లు అర్జున్ పై ఎమ్మెల్సీ వెంకట్ ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకోవాలి. ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే పశ్చాతాపం ప్రకటిస్తాడు అనుకున్నాం. అల్లు అర్జున్ సినిమా హల్ లో ఎంత సేపు ఉన్నాడో, వెళ్ళేప్పుడు ఎలా వెళ్ళాడో ఫుటేజ్ ఉంది. తెలుగు వాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా? రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.