Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత నాలుగేళ్లుగా ఒకే ప్రాజెక్ట్ పై ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం 2021లో రిలీజ్ అయ్యింది. అప్పటినుంచి ఇప్పటివరకు అల్లు అర్జున్.. పుష్ప సినిమాతోనే ట్రావెల్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈక్రమంలో అల్లు అర్జున్.. మరో సినిమాని అనౌన్స్ చేయడం కాదు కదా, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనే హింట్ కూడా ఇవ్వడం లేదు. అయితే అభిమానులంతా అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏమి ఉండబోతుంది..? పుష్ప వంటి సినిమా తరువాత బన్నీ ఏ దర్శకుడికి అవకాశం ఇస్తాడు..? అనే సందేహాలు ఉన్నాయి.
కాగా మొన్నటివరకు బన్నీ లైనప్ గురించి కొన్ని పేరులు వినిపించాయి. అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్, సందీప్ వంగ.. ఇలా పలువురు స్టార్ దర్శకుల పేరులు అల్లు అర్జున్ లైనప్ లో వినిపించాయి. అయితే అట్లీ అండ్ నెల్సన్.. తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని బాలీవుడ్, కోలీవుడ్ హీరోలతో ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి కూడా బాలయ్య సినిమా పై ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. ఇక సందీప్ వంగకి స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలతో దాదాపు ఐదేళ్లు బిజీ షెడ్యూల్ ఉంది. దీంతో అల్లు అర్జున్ లైనప్ లో మిగిలింది త్రివిక్రమ్ మాత్రమే.
గుంటూరు కారంతో ఓకే అనిపించిన త్రివిక్రమ్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని బన్నీతో ప్లాన్ చేసుకుంటున్నారట. వీరిద్దరి కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మరో హిట్ అందుకునేందుకు మరోసారి చేతులు కలుపుతున్నారట. ఈసారి భారీ స్కేల్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్ట్ ని సెట్ చేస్తున్నారట. పుష్ప తరువాత ఈ ప్రాజెక్ట్ నే చేసేందుకు బన్నీ ఫిక్స్ అయ్యినట్లు.. ఫిలిం వర్గాల్లో ప్రస్తుతం గట్టిగా వినిపిస్తున్న వార్త. పుష్ప 2 షూటింగ్ మరో నెల బ్యాలన్స్ ఉందట.