ANR : ఏయన్నార్‌ పారితోషకం చాలా తక్కువ తీసుకొని.. సవాలుగా తీసుకొని చేసిన పాత్ర ఏంటో తెలుసా..?

1950లో తెరకెక్కిన సంసారం సినిమాలో ఏఎన్నార్ వేణు అనే పాత్రలో మొదటిసారి సిటీ కుర్రాడిగా నటించారు.

  • Written By:
  • Publish Date - December 18, 2023 / 09:00 PM IST

అక్కినేని నాగేశ్వరరావు(Akkineni Nageswara Rao) పౌరాణిక సినిమా ద్వారా కథానాయకుడిగా పరిచయమై జానపద హీరోగా ఆడియన్స్ కి దగ్గరయ్యారు. ఒక దశలో అక్కినేని సాంఘిక చిత్రాలకు సరిపోడు అనే ముద్ర ఉండేది. అలాంటి సమయంలో ఏఎన్నార్ దగ్గరికి దర్శకుడు ఎల్వీ ప్రసాద్ ‘సంసారం’ అనే కథని తీసుకువచ్చారు. 1950లో తెరకెక్కిన ఈ సినిమాలో ఏఎన్నార్ వేణు అనే పాత్రలో మొదటిసారి సిటీ కుర్రాడిగా నటించారు.

ఈ చిత్రాన్ని మొదలుపెట్టిన సమయంలో ఏఎన్నార్ పై అనేక కామెంట్స్ వచ్చాయట. జానపద నటుడుకి షర్టు ప్యాంటు వేయించి ఈ పాత్ర ఏమిటి అని ప్రతి ఒక్కరు కామెంట్స్ చేశారట. దీంతో ఏఎన్నార్ ఆ పాత్రని ఒక సవాలుగా తీసుకున్నారు. పారితోషకం కూడా చాలా తక్కువ తీసుకొని ఆ పాత్రని తానే నటిస్తాను అని గట్టి నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో పల్లెటూరి కుర్రాడిలా మొరట వాడిగా కనిపించే హీరో సెకండాఫ్ లో సిటీ కుర్రాడుగా చాలా అందంగా కనిపిస్తాడు.

ఇక ఈ పాత్రని సవాలుగా తీసుకున్న ఏఎన్నార్.. ఈ మూవీలోని ‘‘కల నిజమాయేగా కోరిక తీరేగా’’ అనే పాటలో హ్యాండ్సమ్ గా కనిపించేందుకు ఏదైనా చెయ్యాలని ఆలోచించి మద్రాసు మౌంట్‌ రోడ్డులో ఉన్న ‘మయో ఆప్టికల్స్‌’ షాప్ కి వెళ్లి ఒక కళ్ళజోడు కొన్నారు. ఆ సమయంలో గుండ్రని అద్దాలు ఎక్కువగా వాడేవారు. ఏఎన్నార్ వాటికి భిన్నంగా దీర్ఘ చతురస్రాకారం అంచులు గుండ్రంగా ఉండే కళ్లద్దాల్ని కొనుగోలు చేసి ఆ పాటలో ధరించారు. ఇక ఆ సినిమా మంచి విజయం సాధించి.. ఏఎన్నార్ సాంఘిక చిత్రాలకు కూడా సరిపోతారు అని నిరూపించింది. ఇక మూవీలోని ‘కల నిజమాయేగా’ సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఆ పాటలో అక్కినేని ధరించిన కళ్ళజోడు అప్పట్లో ట్రెండ్ సెట్ చేసింది. దీంతో ఆ సమయంలో ఆప్టికల్స్ దుకాణాల్లో దాదాపు 5000 పైగా కళ్లద్దాలు అమ్ముడుపోయాయట. ఆ తర్వాత ఏఎన్నార్ చాలా సినిమాల్లో అలంటి దీర్ఘ చతురస్రాకార కళ్లజోళ్లతోనే కనిపించారు.

 

Also Read : Operation Valentine : పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నుంచి రాబోయే సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ టీజర్ రిలీజ్..