నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ 2: తాండవం’. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ (OTT) విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలకు తెరదించుతూ, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముందుగా ఊహించినట్లుగానే ఈ నెల 9వ తేదీన ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
Akhanda 2 Postponed
థియేటర్లలో విడుదలైన మొదటి రోజు నుంచే ‘అఖండ 2’ తనదైన ముద్ర వేసింది. దైవత్వం మరియు ప్రకృతిని కాపాడటం అనే అంశాలను మేళవిస్తూ బోయపాటి తెరకెక్కించిన ఈ చిత్రం, బాలయ్య అభిమానులను విశేషంగా అలరించింది. థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. సంక్రాంతి పండుగ కంటే ముందే బాలయ్య సినిమా స్ట్రీమింగ్ కానుండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.
ఈ సినిమాలో బాలకృష్ణ నటన, ముఖ్యంగా అఘోరా గెటప్‌లో ఆయన చెప్పిన డైలాగులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఎస్.ఎస్. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హోరెత్తించింది. వెండితెరపై మాస్ ఎలిమెంట్స్‌తో అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
