Bakka Judson On Liger Movie : ప్లాప్ షోకు `జ‌డ్స‌న్` హిట్ స్టోరీ

తెలుగు సినిమా డైలాగులు, స్టోరీల గురించి చాలా సంద‌ర్బాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌స్తావించారు.

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 03:21 PM IST

తెలుగు సినిమా డైలాగులు, స్టోరీల గురించి చాలా సంద‌ర్బాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌స్తావించారు. తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ధ్వ‌సం చేశార‌ని పలుమార్లు వెలుగెత్తారు. క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు తెలంగాణ సంస్కృతిని కాపాడాల‌ని కూడా పిలుపు నిచ్చారు. సినిమాల్లోనూ తెలంగాణ నేటివిటీ ఉన్న క‌థ‌లు, డైలాగులు ఉండాల‌ని ఉద్య‌మ రోజుల్లో సందేశం ఇచ్చారు. ప్ర‌త్యేక రాష్ట్రం వ‌చ్చిన త‌రువాత తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస‌ను హీరోల‌కు పెడుతున్నార‌ని అసెంబ్లీ వేదిక‌గా గ‌ర్వంగా చెప్పుకొచ్చారు. ఒక‌ప్పుడు కామిడీ కోసం తెలంగాణ యాస‌ను వాడే వాళ్ల‌ని ఇప్పుడు హీరోల‌కు పెడుతున్నార‌ని ప్ర‌స్తావించారు.

క‌ళాకారులు, క‌వులు, ర‌చ‌యిత‌లకు కుల‌, మ‌త‌, ప్రాంతీయ‌భేదాలుండ‌వ‌ని చెబుతుంటారు. కానీ, తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత రెండుగా విడిపోయింది. తెలంగాణ ఛాంబ‌ర్‌, తెలుగు ఛాంబ‌ర్ అంటూ పెట్టుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లోనూ ప్రాంతీయ‌వాదాన్ని రేపారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ గెలుపుకోసం తెర‌వెనుక టీఆర్ఎస్ ప‌నిచేసింద‌ని స‌ర్వ‌త్రా టాలీవుడ్ లో వినిపించిన మాట‌. అంతేకాదు, సినిమాలోని అగ్ర కులాల న‌టుల‌ను దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా మార్చుకుంది. అంతేకాదు, సొంత సామాజిక‌వ‌ర్గం హీరోల‌ను, న‌టులను ప‌రోక్షంగా ప్ర‌మోట్ చేస్తున్నార‌ని టాలీవుడ్ లోని గుస‌గుస‌లు. అందుకు బ‌లంచేకూరేలా ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `లైగ‌ర్` ఎపిసోడ్ ను కొంద‌రు బ‌య‌ట‌కు తీస్తున్నారు.

వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన అర్జున్ రెడ్డి ఫేమ్ విజ‌య్ దేవ‌ర‌కొండ సామాజిక‌వ‌ర్గం ప‌రంగా వెల‌మ‌. సొంత రాష్ట్రం తెలంగాణ‌గా ఫోక‌స్ అయ్యారు. అందుకే, ఆయ‌న్ను టాలీవుడ్ అగ్ర‌హీరోగా మార్చ‌డానికి క‌ల్వ‌కుంట్ల కుటుంబం ప‌లు ప్ర‌య‌త్నాలు చేసింద‌ని తాజాగా కాంగ్రెస్ ప్ర‌ధాని కార్య‌ద‌ర్శి బ‌క్కా జ‌డ్స‌న్ చేస్తోన్న ఆరోప‌ణ‌. `అర్జున్ రెడ్డి` సినిమాను ఐమాక్స్ థియేటర్ లో జర్నలిస్టులకు ఫ్రీ షో స్పాన్సర్ గా టీఆర్ఎస్ నేత‌లు వ్య‌వ‌హ‌రించిన విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు. ఆనాటి నుంచి క‌ల్ల‌కుంట్ల కుటుంబానికి విజయ్ దేవరకొండ తో సానిహిత్యం బాగా పెరిగింద‌ని ఆయ‌న అనుమానిస్తున్నారు. లిక్క‌ర్ స్కామ్ లో క‌విత పేరు వ‌చ్చిన వెంట‌నే `ఎన్ని అవాంతరాలు వచ్చినా కొట్లాడుదాం` అంటూ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ట్వీట్ చేయ‌డాన్ని కూడా జ‌డ్స‌న్ కోడ్ చేస్తున్నారు. అంతేకాదు, టాలీవుడ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కూడా కేసీఆర్ సామాజిక‌వ‌ర్గం కావ‌డంతో తాజాగా విడుద‌లైన `లైగ‌ర్` చుట్టూ ఆర్థిక వివాదం వినిపిస్తోంది. సినిమా వెనుక పెద్దఎత్తున క‌ల్వ‌కుంట్ల కుటుంబం ఆర్థిక లావాదేవీలు ఉన్నాయ‌ని జ‌డ్స‌న్ అనుమానిస్తున్నారు. ఆ మేర‌కు ఢిల్లీ వెళ్లి ఈడీకి ఫిర్యాదును చేశారు.

సాధార‌ణంగా పాన్ ఇండియా సినిమా తీయాలంటే భారీ బ‌డ్జెట్ ఉంటుంది. అదే స్థాయిలో అగ్ర న‌టుల ఎంపిక‌ కూడా జ‌రుగుతుంది. ప్ర‌ధానంగా హీరో ఇమేజ్ మీద పాన్ ఇండియా సినిమాల‌ను నిర్మిస్తుంటారు. ఆ రేంజ్ హీరోగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఫోక‌స్ చేయ‌డానికి ప్ర‌య‌త్నం జ‌రిగింది. ఇలాంటి సాహ‌సం సినిమాల గురించి బాగా తెలిసిన పూరి జ‌గ‌న్నాథ్ చేసి ఉండ‌ర‌ని సినీ వ‌ర్గాల్లోని టాక్. ఎందుకంటే, భారీ బ‌డ్జెట్ ను విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి అప్ క‌మింగ్ హీరోతో చేయ‌డం పెద్ద సాహ‌స‌మే. కానీ, ఆయ‌న డైరెక్షన్ లో నిర్మిత‌మైన `లైగ‌ర్ ` సినిమాకు చార్మి, కరణ్ జోహార్, అపూర్వ మెహతా సహనిర్మాతలుగా ఉన్నారు. బాలీవుడ్ నిర్మాతలు విజ‌య్ దేవ‌ర‌కొండ లాంటి హీరోతో పాన్ ఇండియా సినిమా ఎందుకు ప్లాన్ చేస్తార‌ని టాలీవుడ్ ను వేధిసోన్న ప్ర‌శ్న‌. ఇలాంటి ప్ర‌శ్న నుంచి వ‌చ్చిన అనుమానాల‌తో ఈడీకి కాంగ్రెస్ నేత జ‌డ్స‌న్ ఫిర్యాదు చేయ‌డం ఇప్పుడు సినీ వ‌ర్గాల్లోని పెద్ద చ‌ర్చ‌.

`లైగ‌ర్‌` సినిమాకు అన‌ధికార‌ మార్గాల ద్వారా పెట్టుబ‌డి వ‌చ్చింద‌ని జ‌డ్స‌న్ అనుమానం. క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి, విజ‌య్ కు ఉన్న సాన్నిహిత్యం ప‌ట్టుబ‌డిగా మారింద‌ని ఆయ‌న చెబుతున్నారు. అంతేకాదు, విజ‌య దేవ‌ర‌కొండ సామాజిక‌వ‌ర్గానికి చెందిన మై హోమ్ రామేశ్వ‌ర‌రావు కూడా `జనగణమన ` అనే సినిమాను ప్లాన్ చేశారు. ఆ సినిమాలోనూ విజ‌య్ హీరోగా న‌టిస్తున్నారు. ఆ సినిమాను కూడా భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తీయాల‌ని ప్ర‌ణాళిక ర‌చించారు. ఇవ‌న్నీ చూస్తుంటే, తెలుగు సినిమాపై కేసీఆర్ సామాజిక‌వ‌ర్గం ముద్ర ఉండాల‌ని ప్ర‌య‌త్నం జ‌రుగుతుందా? అనే అనుమానం జ‌డ్స‌న్ కు వ‌చ్చిన‌ట్టు టాలీవుడ్ లోని చాలా మందికి రావ‌డం స‌హ‌జం. తెలంగాణ ఆత్మ‌గౌర‌వం, సంస్కృతి ముసుగులో ప‌లు రంగాల‌పై సొంత సామాజిక‌వర్గం ఆధిప‌త్యాన్ని తీసుకొచ్చిన `క‌ల్వ‌కుంట్ల‌` టీమ్ టాలీవుడ్ పై కూడా ఆ సామాజిక‌వ‌ర్గం ముద్ర వేయ‌డానికి మాస్ట‌ర్ ప్లాన్ వేశార‌ని జ‌డ్స‌న్ ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఆరోప‌ణ‌లు, అనుమానాల‌తో ఆయ‌న ఢిల్లీ వేదిక‌గా ఈడీకి ఫిర్యాదు చేయ‌డం సినీ, రాజ‌కీయ‌, వైద్య‌, విద్యా , స్థిరాస్థి రంగాల్లో పెద్ద చ‌ర్చ‌గా మారింది.