నందమూరి బాలకృష్ణ, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి (NBK&Krish) కాంబినేషన్‌లో కొత్త సినిమా రాబోతోందని గత కొంతకాలంగా సినీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘ఆదిత్య 999’ (Aditya 999) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రం గురించి దసరా పండుగ సందర్భంగా అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాకు బాలయ్యే స్వయంగా కథను అందించడం విశేషం.
గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకున్నాయి. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’తో బాలకృష్ణ తన కెరీర్‌లో మరొక మైలురాయిని అందుకున్నారు. కానీ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. అయితే, ఈసారి మరోసారి ఈ హిట్ కాంబినేషన్ సెట్స్ మీదకు రాబోతోందని తెలియడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
‘ఆదిత్య 999’ సినిమా బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ సినిమాకు కొనసాగింపు అని తెలుస్తోంది. ‘ఆదిత్య 369’ తెలుగు సినిమాల్లో ఒక ప్రత్యేకమైన ప్రయోగాత్మక చిత్రంగా నిలిచిపోయింది. దీనికి కొనసాగింపుగా వస్తున్న ‘ఆదిత్య 999’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్య కథను అందించడంతో ఈసారి ఈ చిత్రం ఎలా ఉంటుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.