34 ఏళ్ల తర్వాత తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ ఆదిత్య 369 (Aditya 369 Re Release)మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీదేవి మూవీస్ నిర్మాణ సంస్థ ఈ సినిమాను అత్యాధునిక 4K రిజల్యూషన్‌లో తిరిగి థియేటర్లలో విడుదల చేసింది. ఈ సందర్బంగా కథకు కేంద్ర బిందువైన టైం మెషీన్(Time Machine)ను ప్రత్యేకంగా రూపొందించి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ప్రదర్శించడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. టీవీ, యూట్యూబ్, ఓటీటీల్లో లభ్యమయ్యే ఒక పాత సినిమాకు ఇంత భారీ ప్రమోషన్ చేయడం నిజంగా ప్రత్యేక విషయం.
ఈ రీ-రిస్లీను మరింత వైభవంగా మార్చేందుకు ఇటీవల ప్రీ-రిసీజ్ ఈవెంట్ కూడా నిర్వహించగా, ఆ వేడుకకు స్వయంగా హీరో నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. గతంలో ఇలాంటి రీ-రిసీస్ ఫంక్షన్‌ను “సింహాద్రి” సినిమాకి చేసినా, ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనలేదు. కానీ ఈసారి బాలకృష్ణ పాల్గొనడం సినిమాకు హైప్ తీసుకొచ్చింది. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూలు, ట్రైలర్, పోస్టర్లు, సోషల్ మీడియా ప్రమోషన్లు ఇలా అన్ని కలిపి నేటి యువతలో ఆసక్తిని పెంచాయి. చాలా మంది 90ల తర్వాత పుట్టినవారు ఈ చిత్రాన్ని స్క్రీన్ పై చూడలేదు. వాళ్లకు ఈ సినిమా థియేటర్లో చూసే అవకాశం ఇప్పుడు లభించింది.
ఇండియన్ సినిమా చరిత్రలో మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ సినిమాగా గుర్తింపు పొందిన ఆదిత్య 369లో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా, ఇళయరాజా సంగీతం, అమ్రిష్ పూరి విలన్ గా నటించారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను తన కెరీర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా గుర్తుపెట్టుకున్నారు.