Report : కామెడీ టు విలనిజం.. రూటు మార్చిన సునీల్!

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఆ ప్రపంచంలో తళుక్కుమనాలని ప్రతిఒక్కరూ కలలు కంటారు. కమెడియన్ సునీల్ ఒకప్పుడు అలాంటి కలే కన్నాడు.

  • Written By:
  • Publish Date - November 11, 2021 / 08:37 PM IST

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఆ ప్రపంచంలో తళుక్కుమనాలని ప్రతిఒక్కరూ కలలు కంటారు. కమెడియన్ సునీల్ ఒకప్పుడు అలాంటి కలే కన్నాడు. వెండితెరపై తనను తానుచూసుకోవాలని గట్టిగా అనుకున్నాడు. సినిమాపై వ్యామోహమో, తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని లక్ష్యమో కానీ.. సీన్ కట్ చేసే కమెడియన్ గా సునీల్ మంచి సక్సెస్ అయ్యాడు. ఒకప్పుడు హీరో సునీల్ లేనిదే మెయిన్ హీరోల సినిమాలు లేవంటే నమశ్యకమే. చిరంజీవి మొదలుకొని చిన్న హీరోల సినిమాల్లో తన కామెడీతో కితకితలు పెట్టించాడు. అయితే ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా హీరో అవతారమెత్తాడు. పూల రంగడు, మర్యాద రామన్న సినిమాలతో సునీల్ కు మంచి పేరు వచ్చింది. ఇక సునీల్ హీరోగా ఖాయమే అని అనుకుంది టాలీవుడ్.

వరుస ఫ్లాపులు

సినిమా కూడా ఓ గేమ్ లాంటిదే. గెలిస్తే ఒక అవకాశం ఉంటుంది, ఓడితే పాతాళానికి తొక్కేస్తుంది. కామెడీ నుంచి హీరోగా మారిన సునీల్ ఆదిలో మంచి విజయాలు అందుకున్నప్పటికీ, ఆ తర్వాత సినిమాలేవీ గుర్తింపు సాధించలేదు. ఇక దర్శకనిర్మాతలు కూడా సునీల్ ను హీరోగా పెట్టుకోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించారు కూడా. ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు, అంతకుముందులా సక్సెస్ కాకపోతే.. మనం చేసే పనిలో వైవిధ్యం చూపించాల్సి ఉంటుంది. హీరో సునీల్ కూడా అంతే. హీరోయిజం విడిచిపెట్టి విలనిజంపై ఫోకస్ చేశాడు.

విలన్ గా మెప్పిస్తాడా?

అయితే హీరో నుంచి విలన్ గా మారిన సునీల్ తన నటనతో మెప్పిస్తాడనే అనుమానం చాలామందికి వచ్చింది. అందరి అంచనాలను నిజం చేస్తూ ‘కలర్ ఫోటో, డిస్కోరాజా’ చిత్రాల్లో తన విలనిజంతో భయపెట్టాడు సునీల్. తాజాగా పాన్ ఇండియా మూవీ పుష్ప‌..ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు సుకుమార్. ఈ మూవీలో హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్నాడు. ఆయ‌న‌కి జోడీగా ర‌ష్మిక‌మంద‌న న‌టిస్తోంది. కాగా న‌టుడు సునీల్ ‘మంగళం శ్రీను’ అనే పాత్రలో న‌టించాడు. ఆయ‌న ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఈ లుక్ లో ఎర్ర‌ని క‌ళ్లు, చేతికి ఉంగ‌రాల‌తో సునీల్ ఫోనులో మాట్లాడుతున్న‌ట్లు క‌న‌ప‌డుతున్నాడు. ఈ లుక్ లో సునీల్ భ‌యంక‌రంగా క‌నిపిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఫాహద్ ఫాజిల్ లా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నట్లు తెలుస్తోంది. విల‌న్ పాత్ర‌ల్లో న‌టించాల‌ని ఉంద‌ని గ‌తంలోనూ సునీల్ చాలా సార్లు చెప్పాడు. అయితే ఒక్కసారి సునీల్ కెరీర్ ను పరిశీలిస్తే కమెడియన్, హీరోగా, విలన్ గా అన్నివర్గాలవారిని ఆకట్టుకున్నాడని చెప్పక తప్పదు.