హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీసిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్‌గా స్పందించింది. ‘దండోరా’ సినిమా ఈవెంట్‌లో మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టి శివాజీకి నోటీసులు జారీ చేసింది. కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద మహిళలపై అసభ్యంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమిషన్ ఆదేశాల మేరకు శనివారం శివాజీ సికింద్రాబాద్‌లోని మహిళా కమిషన్ కార్యాలయానికి హాజరయ్యారు.
హీరోయిన్ల వస్త్రధారణపై సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి. ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో పాటు, సినీ పరిశ్రమలోనూ పెద్ద చర్చకు దారి తీశాయి. మహిళలపై అవమానకరంగా మాట్లాడారని ఆరోపణలు వెల్లువెత్తగా, పలువురు సెలబ్రిటీలు శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనసూయ భరద్వాజ్, చిన్మయి వంటి వారు బహిరంగంగా స్పందిస్తూ, మహిళల వస్త్రధారణ వారి వ్యక్తిగత హక్కు అని స్పష్టం చేశారు. మరోవైపు, శివాజీ వాడిన పదాలు తప్పైనా, ఆయన చెప్పాలనుకున్న ఉద్దేశం మంచిదేనని కొందరు సమర్థించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. దీంతో శివాజీ పేరు సోషల్ మీడియాలో ‘టాక్ ఆఫ్ ద టౌన్’గా మారింది.
మహిళా కమిషన్ కార్యాలయానికి నటుడు శివాజీ#Shivaji #Tollywood #anusuyabharadwaj #HashtagU pic.twitter.com/TVCLWeZAPE
— Hashtag U (@HashtaguIn) December 27, 2025
ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. మహిళలపై చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, అవి అవమానకరంగా ఉన్నాయన్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని కమిషన్ తెలిపింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలని నిర్ణయించిన మహిళా కమిషన్, నటుడు శివాజీకి నోటీసులు జారీ చేసింది. కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద మాట్లాడుతూ, మహిళలపై అసభ్యంగా లేదా అవమానకరంగా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శివాజీ వ్యాఖ్యలపై లీగల్ సలహా తీసుకున్న అనంతరం అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.
నోటీసుల ప్రకారం, డిసెంబర్ 27న వ్యక్తిగతంగా మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని శివాజీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో శనివారం శివాజీ సికింద్రాబాద్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయన కమిషన్ ఎదుట హాజరై, తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణలో శివాజీ ఇచ్చే సమాధానాల ఆధారంగా తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశముందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా ఈ వివాదం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో శివాజీ ఇప్పటికే ఒక వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. తన ఉద్దేశం మహిళలను అవమానించడం కాదని, కొన్ని అభ్యంతరకర పదాలు వాడటం తన పొరపాటేనని ఆయన ఆ వీడియోలో తెలిపారు. మహిళలను గౌరవిస్తానని, తన మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. అయితే, ఆ క్షమాపణలు సరిపోతాయా? లేక చట్టపరమైన చర్యలు తప్పవా? అనే చర్చ కొనసాగుతోంది. మొత్తానికి, శివాజీ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు మహిళా కమిషన్ విచారణ వరకు చేరడం సినీ పరిశ్రమలోనే కాదు, సామాజిక వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది. కమిషన్ ఎదుట శివాజీ ఇచ్చే వివరణ, దానిపై నేరెళ్ల శారద నేతృత్వంలోని కమిషన్ ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
