Site icon HashtagU Telugu

Salman Khan: కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం.. సల్మాన్‌కు బెదిరింపు

Actor Salman Khan Death Threat Lawrence Bishnoi Gang

Salman Khan: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌కు మరోసారి హత్య బెదిరింపు వచ్చింది. ‘‘ఇంట్లోనే కాల్చి చంపేస్తాం లేదంటే కారులో బాంబు పెట్టి పేల్చేస్తాం’’ అంటూ గుర్తు తెలియని దుండగులు వార్నింగ్ ఇచ్చారు. ముంబైలోని వర్లిలో ఉన్న రవాణా శాఖ కార్యాలయం అధికారిక వాట్సాప్ నంబరుకు ఈమేరకు వార్నింగ్ మెసేజ్(Salman Khan) అందింది. దీనిపై వర్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. మొత్తం మీద ఈ బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తనకు వస్తున్న బెదిరింపుల విషయంలో ఇటీవలే తొలిసారిగా సల్మాన్ స్పందించారు. ‘‘భగవాన్, అల్లా అందరూ పైన ఉన్నారు. వాళ్లు నాకు ఎంత ఆయుష్షు రాసి పెడితే అన్ని రోజులే బతుకుతాను. అంతే’’ అని సల్లూభాయ్ స్పష్టం చేశాడు. 

Also Read :Ukraine Partition : జర్మనీలా ఉక్రెయిన్‌ విభజన.. ట్రంప్ అనూహ్య ప్లాన్ ?!

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేనా ? 

సంచలన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైలులో ఉన్నాడు. అక్కడి నుంచే అతడు తన గ్యాంగ్‌ను ఆపరేట్ చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని నిరూపించే ఆధారాలేం అందుబాటులో లేవు.  ముంబైలోని బాంద్రా ఏరియాలో సల్మాన్ ఖాన్ ఇల్లు ఉంది. ఏడాది క్రితం దానిపై  గుర్తు తెలియని దుండగులు అనేక రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ తర్వాత కూడా పలుమార్లు సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి.

Also Read :Laser Weapon: భారత్‌కు లేజర్ ఆయుధం.. కర్నూలులో ప్రయోగం సక్సెస్

1998 సంవత్సరంలో ఏమైందంటే.. 

1998 సంవత్సరంలో కృష్ణ జింకల వేట కేసులో సల్మాన్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. ఆనాటి నుంచి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు వరుస బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్‌కు బెదిరింపులు ఇవ్వడం వల్ల తనకు పాపులారిటీ వచ్చిందని గతంలో పలుమార్లు స్వయంగా లారెన్స్ బిష్ణోయ్ చెప్పుకున్నాడు. ‘‘కృష్ణ జింకలు బిష్ణోయ్ సమాజానికి పవిత్రమైనవి. వాటిని వేటాడి సల్మాన్ అపచారం చేశాడు. మా సమాజానికి అతడు క్షమాపణలు చెప్పాలి’’ అని చాలాసార్లు లారెన్స్ డిమాండ్ చేశాడు. ఈనేపథ్యంలో ఇప్పుడు వచ్చిన బెదిరింపుల వెనుక కూడా లారెన్స్ గ్యాంగే ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.