Betting apps case : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. మనీ లాండరింగ్ కోణంలో విచారణ చేపట్టిన ఈడీ, పలువురు సినీ ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ బుధవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్లు చేసిన వ్యవహారంలో ఆయన పేరుతో పాటు మరికొంతమంది ప్రముఖుల పేర్లు వెలుగులోకి రావడంతో విచారణ గమనికను విస్తరించింది. ఈడీ అనుమానిస్తున్న అంశాల ప్రకారం, యాప్‌ల ప్రమోషన్ల ద్వారా సేకరించిన నిధులను హవాలా మార్గంలో వేరే దేశాలకు తరలించినట్లు సమాచారం.
Read Also: Jammu and Kashmir : మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
మనీ లాండరింగ్ నిర్ధారణకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు ఈడీ దర్యాప్తును మరింత లోతుగా తీసుకెళ్తోంది.ఇప్పటికే రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి తదితరులకూ ఈడీ నోటీసులు జారీ చేసింది. రానాను ఈ నెల 23న విచారణకు పిలవగా, ఆయన గడువు కోరడంతో ఆగస్టు 11న హాజరుకావాలని సూచించారు. విజయ్ దేవరకొండను ఆగస్టు 6న, మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు పిలిచింది. ఈ వ్యవహారంపై గతంలో పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖపట్నం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల ఆధారంగా ఈడీ ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే మొత్తం 29 మంది పైగా సినీ నటులు, యూట్యూబ్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ప్రభావశీలులపై ఈడీ కేసు నమోదు చేసినట్లు సమాచారం. వివాదాస్పదంగా మారిన జంగిల్ రమ్మీ, జీత్‌విన్, లోటస్365 వంటి బెట్టింగ్ యాప్‌లకు ఈ ప్రముఖులు ప్రమోషన్లు చేయడం వల్ల వేలాది మంది యువత పూనుకొని భారీగా డబ్బులు కోల్పోయారు.
కొన్ని ఘటనల్లో యువకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా నమోదయ్యాయి. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పోలీసులు ఇప్పటివరకు ఐదు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌లో పాల్గొన్న వారిపై దర్యాప్తు చేపట్టారు. ఆ ఆధారాలను ఈడీ సేకరించి ఆర్థిక నేరాల కోణంలో విచారణను ప్రారంభించింది. బెట్టింగ్ యాప్ నిర్వాహకులు తమ సేవల కోసం పలువురు ప్రముఖులకు పెద్ద మొత్తంలో డబ్బులు హవాలా మార్గంలో చెల్లించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో వేల కోట్ల రూపాయల హవాలా లావాదేవీలు జరిగినట్టు అంచనా. ఇకపై మరిన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ కేసు మరింత తారాస్థాయికి చేరే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజల మోసం, అనుమానాస్పద లావాదేవీల కేసులపై కఠినంగా వ్యవహరించేందుకు ఈడీ సిద్ధంగా ఉందని సమాచారం.
Read Also: Box Office : ప్రేక్షకులను థియేటర్స్ కు రాకుండా చేస్తుంది నిర్మాతలే !!