Nirmalamma: తెలుగు సినిమా ‘బామ్మ’ నిర్మలమ్మ!

‘ఎంత పొగరురా నీకు? వదినతో చాకిరీలు చేయించుకుంటావా? వేణ్ణీళ్ళు తోడాలి...సబ్బెట్టాలి...’ అంటూ ఆమె ‘గ్యాంగ్‌ లీడ సినిమాల్లో రెచ్చిపోతే.. చిరంజీవి

  • Written By:
  • Publish Date - February 19, 2022 / 12:57 PM IST

Story By : పి.వి.డి.ఎస్‌.ప్రకాష్

‘ఎంత పొగరురా నీకు? వదినతో చాకిరీలు చేయించుకుంటావా? వేణ్ణీళ్ళు తోడాలి…సబ్బెట్టాలి…’ అంటూ ఆమె ‘గ్యాంగ్‌ లీడ సినిమాల్లో రెచ్చిపోతే.. చిరంజీవి సైతం అదే రేంజిలో రెస్పాన్స్‌ ఇవ్వడం…రఫ్ఫాడిస్తానంటూ హంగామా చేయడం.. ఆ చిత్ర విజయానికి ఎంతో దోహదపడింది. ఒక్క చిరంజీవికి మాత్రమే కాదు…ఏంతో మంది కథానాయకులకు తల్లిగా, బామ్మగా, నాన్నమ్మగా ఆమె నటించి మెప్పించారు. ఓ రకంగా చెప్పుకోవాలంటే తెలుగు సినిమా బామ్మ అంటే చటుక్కున గుర్తు వచ్చే పేరు ఆమెది. సినిమా ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆ పేరుని అక్షరాలా సార్ధకం చేసుకున్న సహజ నటీమణి ఆమె… నిర్మలమ్మ. దర్శకులు, రచయితలు రూపొందించిన వివిధ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ద్వారా…ఆ పాత్రని తెరపై ఎంచక్కా ఆవిష్కరించే ప్రతిభ ఉన్న కళాకారిణి నిర్మలమ్మ. ఈరోజు ఆమె వర్థంతి. ఈ సందర్భంగా నిర్మలమైన మనసు‍గల నిర్మలమ్మ గురించి తెలుసుకుందాం…

నిర్మలమ్మని తలచుకోగానే.. మనింట్లోనో…పక్కింట్లోనూ ప్రతిరోజూ కనిపించే బామ్మ అనిపిస్తుంది. అంతలా… ప్రేక్షకుల మనసులో శాశ్వత స్థానం సముపార్జించుకున్న నిర్మలమ్మ తనకు గుర్తుగా కొన్ని మరపురాని పాత్రల్ని వదిలి… ఎన్నటికీ తిరిగి రాలేని దూరతీరాలకు తరలిపోయిన రోజు… ఫిబ్రవరి 19. నిర్మలమ్మ 1927లో మచిలీపట్నంలో పుట్టారు. 2009 ఫిబ్రవరి 19న హైదారాబాద్‌లో మరణించారు. జననం నుంచి మరణం వరకూ సాగిన సుదీర్ఘ జీవన యానంలో కళాకారిణిగా లబ్దప్రతిష్టులయ్యారు. మొదట్లో కొంత నిరాశ ఎదురైనా… నిలిచి గెలిచి తనకంటూ కొంత కీర్తిని ఆర్జించుకున్నారు.

64 ఏళ్ల అనుభవం..

1000కి పైగా సినిమాలు సినీ వజ్రోత్సవాల సందర్భంగా నిర్మలమ్మ మాట్లాడుతూ… తన సినీ అనుభవాన్ని 64 సంవత్సరాలుగా అభివర్ణించారు. రికార్డులను బట్టి చూస్తే వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన చరిత్ర ఆమెది. 1943లో తన పదహారో ఏట ‘గరుడ గర్వ భంగం’ చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమయ్యారు. ఆ సినిమాలో ఆమె అలనాటి మేటి నటీమణి భానుమతి సరసన చెలికత్తె పాత్రలో కనిపించారు. పేరుకు చెలికత్తె అయినా… పాత్ర నిడివి బాగా పెద్దది అని… తనపై సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని… ఆ నాటి రోజుల్ని తలచుకుంటూ మురిసిపోయేవారు నిర్మలమ్మ. ఆ తరువాత…‘పాదుకా పట్టాభిషేకం’ సినిమాలో నటించారు. అందులో తన అభినయం పట్ల బాగా నమ్మకం పెంచుకున్న నిర్మలమ్మ విజయవాడలో ఆ సినిమా చూసి కంగు తిన్నారు. చిత్ర ప్రదర్శన పూర్తయింది కానీ… తన పాత్ర ఎక్కడా కనిపించకపోవడంతో తీవ్ర నిరాశకి లోనయ్యారు. ఇక… సినిమాలో కొనసాగడం సరికాదనే కృత నిశ్చయంతో తిరిగి రంగస్థల కళాకారిణిగా ఎన్నో నాటకాలు వేశారు. పేరు తెచ్చుకున్నారు. అయితే…అడపా తడపా సినీ పరిశ్రమ నుంచి పిలుపులో రావడం…వెళ్లాలా, వద్దా? అనే సంశయంతో ఊగిసలాడడం… వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సన్నిహితులు సూచించడంతో…తిరిగి చెన్నై వెళ్లి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈసారి ఆమె ప్రయత్నాలకు నిర్మాతల, దర్శకుల మద్దతు ఎక్కువగా లభించి నిర్మలమ్మ అనే కళాకారిణి నిలదొక్కుకుంది. కాలక్రమేణా… ఆమె తల్లిగా, బామ్మగా స్థిరపడి ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు. తనకంటే పెద్దవారయిన నందమూరి, అక్కినేని, ఎస్వీ రంగారావు మొదలుకుని…ఎంతోమందికి తల్లి పాత్రల్లో కనిపించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌… ఇలా ఇంకెంతమందికో బామ్మగా, నాన్నమ్మగా కనిపించారు.

చిరస్మరణీయ చిత్రాలు ఎన్నో

నిర్మలమ్మ ఎన్నో చిరస్మరణీయ చిత్రాల్లో తెర పంచుకున్నారు. కె.విశ్వనాధ్‌ దర్శకత్వం వహించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘శంకరాభరణం’లో వైవిధ్యమైన పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆయన చిత్రాలే…‘శుభ సంకల్పం’, ‘శుభలేఖ’, ‘ఆపద్భాంధవుడు’, ‘స్వాతిముత్యం’లో కూడా నిర్మలమ్మ చెప్పుకోదగ్గ పాత్రలే వేశారు. మొదట్లో వేసిన చిత్రాల్లో కొన్ని నిర్మలమ్మ నట ప్రతిభకు అద్దం పట్టేవి చాలా ఉన్నాయి. ‘భాగ్యదేవత’, ‘భార్యాభర్తలు’, ‘కులగోత్రాలు’, ‘ఇరుగుపొరుగు’, ‘దేవత’, ‘అర్ధరాత్రి’, ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’, ‘ఇదెక్కడి న్యాయం’, ‘శివరంజని’, ‘పదహారేళ్ళ వయసు’, ‘కోతలరాయుడు’, ‘మోసగాడు’, ‘అగ్నిపూలు’… ఇలా చాలా చిత్రాల్లో నిర్మలమ్మ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మగమహారాజు’, ‘మంత్రిగారి వియ్యంకుడు’, ‘సంఘర్షణ’, ‘బాబాయ్‌ అబ్బాయ్‌’, ‘ హీరో’, ‘మహానగరంలో మాయగాడు’, ‘రుస్తుం’, ‘మయూరి’, ‘ముచ్చటగా’, ‘ముగ్గురు’, ‘ఒక రాధా…ఇద్దరు కృష్ణులు’, ‘శ్రీ కనకమాలష్మి రికార్డింగ్‌ డాన్స్‌ ట్రూప్‌’, ‘నాకూ పెళ్ళాం కావాలి’, ‘వారసుడొచ్చాడు’, ‘చిన్నోడు పెద్దోడు’, ‘ఆఖరిపోరాటం’, ‘మాయలోడు’, ‘ ష్‌…గప్‌ చుప్‌’, ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘సీతా రామరాజు‘, ‘అలీబాబా అరడజను దొంగలు’, ‘బిగ్‌ బాస్‌’, ‘మావి చిగురు’, ‘రాయుడు’, ‘స్నేహం కోసం’…చిత్రాలు నిర్మలమ్మలోని నటిని వెలికి తీశాయి. ‘స్నేహం కోసం’ చిత్రం తరువాత ఆమె నటించడం మానేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి బలవంతం మీద ‘ప్రేమకు ఆహ్వానం’ చిత్రంలో ఆమె చివరిసారి కనిపించారు.

దాసరి చిత్రాల్లో ఎక్కువగా

నిర్మలమ్మ ఎంతోమంది దర్శకులతో నిర్మలమ్మ నటించినా… ఎక్కువగా దాసరి చిత్రాల్లో తాను నటించానని నిర్మలమ్మ చెప్పుకునేవారు. దాసరికి నటిగా తనంటే ఎంతో ఇస్తామని ఆమె తరచూ అనేవారు. అందుకే… ఆయన సినిమాల్లో ఎక్కువగా పాత్రలు చేసిన అనుభవం ఉందనేవారు. నిర్మలమ్మ తన 19 ఏళ్ల వయసులో ప్రొడక్షన్‌ మేనేజర్‌ జీవీ కృష్ణారావుని పెళ్లి చేసుకున్నారు. వీరికి సంతానం లేదు. ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్నారు. ఆ దత్తపుత్రిక పేరు కవిత.