Adipurush Team: ఆంజనేయుడి కోసం థియేటర్లలో ప్రత్యేకంగా ఓ సీటు: ఆదిపురుష్ టీం!

ఆదిపురుష్ సినిమా ప్రదర్శనల్లో ఓ సీటును హనుమంతుడికి రిజర్వ్ చేస్తామని వెల్లడించింది.

  • Written By:
  • Updated On - June 6, 2023 / 12:10 PM IST

పిలిస్తే పలికే దైవం హనుమంతుడు. ఎక్కడైతే శ్రీరామ నామం వినిపిస్తుందో, అక్కడ ఆంజనేయుడు వాలిపోతాడు. ఆంజనేయుడ్ని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు తరుచుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు శ్రీరామ జపం చేస్తుంటారు. అంతేకాదు.. రామాయణ పారాయణం ఎక్కడ జరిగినా అక్కడికి ఆంజనేయుడు వస్తాడని హిందువుల నమ్మకం.. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ఆదిపురుష్ సినిమా టీం తాజాగా ఓ ప్రకటన చేసింది. శ్రీరాముడి కథతో తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమా ప్రదర్శనల్లో ఓ సీటును హనుమంతుడికి రిజర్వ్ చేస్తామని వెల్లడించింది. సినిమా ప్రదర్శించే ప్రతీ థియేటర్ లో ఓ సీటును అమ్మకుండా ఉంచేస్తామంటూ ఆదిపురుష్ టీం ఓ ప్రకటన విడుదల చేసింది.

ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 16న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో, సుమారు రూ.500 కోట్ల భారీ బడ్జెత్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు సమాచారం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు తిరుపతిలో నిర్వహించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎత్తున జరుగుతున్న ఈ ప్రిరిలీజ్ ఈవెంట్ కు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీగా తరలివస్తున్నారు.

Also Read: Pawan Kalyan: పవన్ ‘వారాహి’ యాత్రకు సర్వం సిద్ధం!