నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్ల దుస్తులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన ఇప్పటికే క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. అయితే తన మాటలకు కట్టుబడే ఉన్నానని శివాజీ తెలిపారు. తాను మాట్లాడిన మాటల్లో రెండు తప్పు పదాలు దొర్లాయని, దానికి మాత్రమే సారీ చెబుతున్నానని అన్నారు. అనూహ్యంగా ఈ వివాదంలోకి ‘పెద్ది’ సినిమా వచ్చి చేరింది. ఈ ఇష్యూలో శివాజీకి సపోర్ట్ చేస్తున్న సెలబ్రిటీలు, నెటిజన్లు.. రామ్ చరణ్ పాటపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
నటుడు శివాజీ వివాదం చిలికి చిలికి ఇప్పుడు ‘చికిరి చికిరి’ పాటపైకి వచ్చి పడింది. అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ‘పెద్ది’ సినిమాకి చుట్టుకునేలా కనిపిస్తోంది. ఇటీవల ‘దండోరా’ ఈవెంట్ లో హీరోయిన్ల డ్రెస్టింగ్ పై శివాజీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గంటల వ్యవధిలోనే క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. అక్కడితో అంతా అయిపోయిందని అనుకుంటే, తన వివాదాన్ని తానే కొత్త మలుపు తిప్పాడు శివాజీ. సారీ చెప్పిన రెండో రోజే మాట మార్చారు. తన స్టేట్మెంట్ కి కట్టుబడి ఉన్నానని, కానీ తాను మాట్లాడిన దాంట్లో రెండు పదాలకు మాత్రమే క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. తను మాట్లాడింది కరెక్ట్ అంటూ సమర్థించుకున్నారు. అయితే శివాజీ మాట్లాడింది తప్పైతే, ‘చికిరి చికిరి’ పాటలో లిరిక్స్ కూడా తప్పే కదా అనే వాదన తెర మీదకి వచ్చింది.
‘దండోరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శివాజీ మాట్లాడుతూ.. “హీరోయిన్ల అందం నిండుగా కప్పుకునే దుస్తుల్లోనే ఉంటుంది తప్ప, సామాన్లు కనిపించేలా వస్తే ఉండదు. సామాన్లు కనిపించే దుస్తులు వేసుకున్నప్పుడు చూసినవాళ్లు పైకి నవ్వుతారు కానీ, లోపల మాత్రం ‘దరిద్రపు ముం*’ ఇలాంటి బట్టలు వేసుకుంది ఏంటి అని తిట్టుకుంటారు” అని అన్నారు. ఇదే ఆయన్ని వివాదంలో లాగింది. సినీ ప్రముఖులు, మహిళా సంఘాలు, హీరోయిన్లు శివాజీ వ్యాఖ్యలను ఖండించారు. స్త్రీలను కించపరిచారంటూ మండిపడ్డారు. హీరోయిన్లు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో చెప్పడానికి నువ్వెవరు అంటూ ఫైర్ అయ్యారు. అనసూయ భరద్వాజ్, చిన్మయి, మంచు లక్ష్మి, పాయల్ రాజ్ పుత్, రామ్ గోపాల్ వర్మ, మంచు మనోజ్ లాంటి వాళ్లు శివాజీ కామెంట్స్ ను ఖండిస్తూ పోస్టులు పెట్టారు.
అయితే ఈ వివాదంలో శివాజీకి ఓ వర్గం నుంచి మద్దతు లభిస్తోంది. నటుడు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సినిమా హీరోయిన్లు బయటికి వచ్చేటప్పుడు సాంప్రదాయబద్ధంగా దుస్తులు ధరించమని ఆయన సూచించారని, సరిగ్గానే మాట్లాడారని సమర్థిస్తున్నారు. పదజాలం విషయంలో కొన్ని తప్పులు ఉండచ్చు కానీ, ఆయన సమాజ శ్రేయస్సు దృష్ట్యా మాట్లాడిన భావజాలం మాత్రం తప్పు కాదని అంటున్నారు. కరాటే కళ్యాణి, శేఖర్ భాషా లాంఅభ్యంతరంటి కొందరు సెలబ్రిటీలు కూడా శివాజీకి సపోర్టుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ‘పెద్ది’ సినిమాని వివాదంలోకి లాగుతున్నారు. శివాజీ మాట్లాడిన సామాన్లు పదంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వారు.. ‘చికిరి చికిరి’ పాటలోని లిరిక్స్ పై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు.
రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది’. ప్రమోషన్స్ లో భాగంగా ఆ మధ్య ‘చికిరి చికిరి’ అనే పాటను విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. మిలియన్ల వ్యూస్, లక్షల కొలదీ లైక్స్ తో దూసుకుపోతోంది. పాట మధ్యలో “పడతా పడతా పడతా ఎనుకే ఎనుకే పడతా.. సరుకు సామాను సూసి మీసం లేసి ఏసే కేక” అనే లిరిక్స్ వినిపిస్తాయి. హీరోయిన్ ని ఉద్దేశిస్తూ హీరో పాడుకునే ఈ సాహిత్యాన్నే ఇప్పుడు శివాజీ వివాదంలోకి తీసుకొస్తున్నారు. శివాజీ మాట్లాడింది తప్పైతే.. రామ్ చరణ్ సినిమాలోని ‘పెద్ది’ పాట కూడా తప్పే కదా అని కరాటే కళ్యాణి ప్రశ్నించింది.
ఒక పెద్ద హీరో సినిమాలో స్త్రీని వర్ణిస్తూ ‘సామాన్లు’ అనే పదం వచ్చినప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, ఒక్కరు కూడా నెగెటివ్ కామెంట్ చేయలేదని, పైగా ఆ పాటను అందరూ ఎంజాయ్ చేశారని, చాలామంది ఆ పాటలకు రీల్స్ కూడా చేశారని బిగ్ బాస్ ఫ్యాన్ శేఖర్ భాషా అన్నాడు. పాటలో ఆ పదం తప్పు కానప్పుడు, శివాజీ ఆవేదనతో అదే పదం అంటే తప్పు అయిందా? అని వాదిస్తున్నాడు. ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు ప్రవర్తిస్తున్నారని, అందరూ ఒకేసారి దాడి చేయడం సరికాదని అన్నాడు. శివాజీ వాడిన ఆ రెండు పదాలు కచ్చితంగా అభ్యంతరకరమేనని, దానికి ఆయన ఇప్పటికే క్షమాపణలు చెప్పాడని శేఖర్ బాషా అన్నాడు.
పలువురు నెటిజన్లు సైతం శివాజీ వాడిన సామాన్లు పదం తప్పు అయినప్పుడు, ‘పెద్ది’ పాటలో అదే పదం వాడితే ఎందుకు అభ్యంతరం చెప్పలేదంటూ పోస్టులు పెడుతున్నారు. ఇలా శివాజీ ఇష్యూలోకి పెద్ది పాట వచ్చి చేరింది. దీనిపై మేకర్స్ స్పందిస్తారేమో చూడాలి. మరోవైపు శివాజీ తన స్టేట్‌మెంట్‌కు కట్టుబడే ఉన్నానని తేల్చిచెప్పారు. రెండు పదాలు మాత్రమే తప్పుగా దొర్లాయని, దానికి మాత్రం రిగ్రెట్ అవుతున్నానని అన్నారు. ఎవరికీ భయపడేది లేదని, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
