Tollywood: ‘సితార’ సినిమాకు 40 వసంతాలు.. తెలుగు చలన చిత్రాల్లో ఓ కల్ట్ క్లాసిక్!

  • Written By:
  • Updated On - April 26, 2024 / 04:47 PM IST

Tollywood: పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ దర్సకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన కళాత్మక కావ్యం సితార’. ఏప్రిల్ 27, 1984న విడుదలైన ఈ చిత్రం 40 వసంతాలు పూర్తి చేసుకుంది. పూర్ణోదయా చిత్రాలైన ‘తాయారమ్మ-బంగారయ్య’, ‘శంకరాభరణం’, ’సీతాకోకచిలక’చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన వంశీలో ఉన్న ప్రతిభను గుర్తించిన ఏడిద నాగేశ్వరరావు, వంశీకి ఈ అవకాశం ఇచ్చారు. వంశీ రచించిన ‘మహల్లో కోకిల’ నవల ఆధారంగా ఈ చిత్రం నిర్మించడం జరిగింది. అప్పుడప్పుడే నటుడిగా పైకి వస్తున్న హీరో సుమన్ ఈ చిత్ర కథానాయకుడు . ఈ చిత్రంతో భానుప్రియ చిత్రసీమకు పరిచయం అయ్యింది. ఒకప్పుడు రాజభోగం అనుభవించిన రాజా గారి వంశం ఇప్పుడు దీనస్థితిలో ఉన్నా, బయటి ప్రపంచానికి మాత్రం తమ పరిస్థితులు తెలియనీయకుండా రాజవంశపు ఆచారాలు, ఘోషాలు, అలాగే ప్రదర్శిస్తూ ఉండే యువరాజా వారి పాత్రను ప్రముఖ నటుడు శరత్‌బాబు అత్యద్భుతంగా పోషించి, తన సినీ కెరీర్లోనే ఓ గొప్ప పాత్రగా మిగిలిపోయేలా నటించారు.

అలాగే శుభలేఖ సుధాకర్, ఏడిద శ్రీరాం, జె.వి.సోమయాజులు, సాక్షి రంగారావు, రాళ్ళపల్లి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఈ చిత్రానికి వంశీ దర్శకత్వ ప్రతిభకు అనుగుణంగా మేస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన సంగీతం ఓ ప్రాణం. పాటలన్నీ ఒక ఎత్తయితే, ఈ చిత్రంలో వచ్చే silent visualsకి ఆయన చేసిన రీ రికార్డింగ్ చిత్రాన్ని మరో ఎత్తుకి తీసుకువెళ్ళింది, అలాగే ఎం.వి.రఘు ఛాయాగ్రహణం, అనిల్ మల్నాడ్ ఎడిటింగ్ కూడా.
‘సితార’ అప్పట్లో 11 కేంద్రాల్లొ 100 రోజులు ప్రదర్శింపబడింది.

అలాగే 3 జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా, వెన్నెల్లో గోదారి అందం పాటకు గాను ఎస్.జానకికి ఉత్తమ నేపథ్య గాయనిగా, అనిల్ మల్నాడ్‌కి ఉత్తమ ఎడిటర్‌గా అవార్డులు వచ్చాయి. Indian Panoramaలో ప్రదర్శింపబడిన ఈ చిత్రాన్ని రష్యన్ భాషలో డబ్ చేసి రష్యాలో విడుదల చేశారు. అలాగే ఎన్నో అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ‘సితార’ను ప్రదర్శించారు. ఇప్పటికీ ఈ చిత్రం తెలుగు చలన చిత్రాల్లో ఓ Cult Classicగా మిగిలిపోయింది. ఇప్పటికి ఈ మూవీకి తెలుగు ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ ఉంది.