Site icon HashtagU Telugu

Box Office War: 4 వారాల్లో రూ.1200 కోట్లు..ఎంత రాబడతాయో..?

Box Office 1200cr

Box Office 1200cr

2025 ఫస్ట్ హాఫ్ తెలుగు సినీ పరిశ్రమకు పెద్దగా కలిసిరాలేదు. సాధారణంగా విడుదలయ్యే వంద సినిమాల్లో కనీసం పదైనా విజయం సాధిస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తారు. కానీ ఈసారి ఆ స్థాయిలో కూడా సినిమాలు హిట్ కాకపోవడం, ఆశలు పెట్టుకున్న చిత్రాలు పరాజయాలను మూటగట్టుకోవడం, పలు సినిమాలు వాయిదాల వలయంలో చిక్కుకుని విడుదల కాలేకపోవడం ఫస్ట్ హాఫ్ ను చాలా డల్‌గా మార్చేశాయి. దీంతో టాలీవుడ్ ఆశలన్నీ సెకండాఫ్‌పై పెట్టుకుంది.

జులై నుండి వచ్చే నాలుగు వారాలు తెలుగు సినిమా పరిశ్రమకు కీలకంగా మారబోతున్నాయి. ఈ నాలుగు వారాల వ్యవధిలో నాలుగు భారీ సినిమాలు విడుదల కానున్నాయి. ప‌వ‌న్ కళ్యాణ్ నటించిన “హరి హర వీరమల్లుం” (Hariharaveeramallu)జూలై 24న విడుదలవుతోంది. దాదాపు నాలుగేళ్లుగా నిలిచిపోయిన ఈ చిత్రం ఎట్టకేలకు తెరపైకి రానుంది. రూ.250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం అయ్యిన నేపథ్యంలో ఈ సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడింది. విడుదలకు ముందు బయ్యర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే, బాక్సాఫీసుకు మంచి ఊపు వచ్చే అవకాశముంది.

World Population Day : జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలి: సీఎం చంద్రబాబు

వీరమల్లుం విడుదలైన వారం తర్వాత విజయ్ దేవరకొండ నటించిన “కింగ్ డమ్”(Kingdom ) థియేటర్లలోకి రానుంది. గత కొంతకాలంగా విజయ్ వరుస ఫ్లాప్స్ ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ సినిమాపై ఉన్న హైప్ మాత్రం తగ్గలేదు. నిర్మాత నాగవంశీ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కలయికపై అభిమానుల్లో నమ్మకం ఉంది. రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కూడా ఓ రిస్కీ ప్రాజెక్టే. అయితే ఈ సినిమా విజయవంతమైతే, టాలీవుడ్ బాక్సాఫీసుకు మరో బూస్ట్ కలిగించే అవకాశం ఉంది. మధ్యలో ఆగస్టు 09 మహేష్ నటించిన అతడు మూవీ రీ రిలీజ్ అవుతుంది.

ఇక ఆగస్టు 14న ఒకేసారి రెండు భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్న “వార్ 2″(War2), రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కలిసి నటిస్తున్న “కూలీ”(Kuli ). రెండూ సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపొందాయి. వార్ 2 సినిమాకు ఎన్టీఆర్ ఉండటమే సౌత్ మార్కెట్లో క్రేజ్‌ను పెంచింది. అదే సమయంలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన కూలీ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. రజనీకాంత్ లీడ్‌లో ఉండటంతో పాటు నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ మద్దతుతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపే అవకాశముంది. నాలుగు వారాల్లోనే దాదాపు రూ.1200 కోట్ల బెట్ ఈ చిత్రసీమలో పడనున్నది. ఈ నాలుగు సినిమాలు నిలబడితేనే టాలీవుడ్‌కు బాక్సాఫీసు కు ఊపిరి పోసినట్లు అవుతుంది. మరి 2025 సెకండాఫ్ జాతకాన్ని ఈ సినిమాలు ఎంతమేర మారుస్తాయో చూడాలి.

BC Reservation : 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి పోరాటం – కవిత