Site icon HashtagU Telugu

Zomato: విమానయాన రంగంలోకి జొమాటో వ్యవస్థాపకుడు..ప్రైవేటు జెట్‌తో ఎంట్రీ

Zomato founder enters aviation sector with private jet

Zomato founder enters aviation sector with private jet

Zomato : ప్రముఖ ఫుడ్‌ డెలివరీ యాప్‌ జొమాటో మాతృ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్‌ గోయల్‌ ఇప్పుడు వ్యాపార విస్తరణలో భాగంగా పౌర విమానయాన రంగం వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఆయన ‘LAT Aerospace’ పేరుతో ఓ ఏవియేషన్ వెంచర్‌ను ప్రారంభించారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సంస్థ బాంబర్డియర్‌ గ్లోబల్‌ సిరీస్‌కు చెందిన లగ్జరీ ప్రైవేట్‌ జెట్‌ను కొనుగోలు చేసినట్లు ఆంగ్ల మీడియా కథనాలు తెలిపాయి. ఈ ప్రైవేట్ జెట్‌ ఈ ఏడాది జూన్‌ నెల నుంచి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని వీఐపీ బే వద్ద కనిపిస్తూ ఉంది. త్వరలోనే దీని కార్యకలాపాలు ప్రారంభం కానున్నట్లు సమాచారం. జూలై 16 నుంచే ఈ ప్రైవేట్‌ విమానం అధికారికంగా సేవలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. దీని నిర్వహణ బాధ్యతలను ఇందమెర్ ఎంజెట్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ మరియు బర్డ్ ఎగ్జిక్యూజెట్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ అనే రెండు ప్రైవేట్ సంస్థలు చేపట్టనున్నాయి.

Read Also: Rohini Court : రోహిణి కోర్టు పరిసరాల్లో నిషేధాజ్ఞలు.. తెల్ల షర్టు.. నల్ల ప్యాంటుతో రావొద్దు..

ఈ ప్రైవేట్‌ జెట్‌కు సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్స్ మోడల్, ఇన్టీరియర్ ఫీచర్లు ఇంకా అధికారికంగా వెలుగులోకి రాలేదు. కానీ బాంబర్డియర్‌ గ్లోబల్‌ సిరీస్‌కు చెందిన జెట్‌లు సాధారణంగా హై-ఎండ్‌ ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి. వీటిలో సౌకర్యవంతమైన సీటింగ్‌, ఇంటర్నెట్ కనెక్టివిటీ, కాన్ఫరెన్స్‌ ఫెసిలిటీస్‌ వంటి అధునాతన ఫీచర్లు ఉంటాయి. గత కొద్ది కాలంగా దీపిందర్‌ గోయల్‌ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆయన గురుగ్రామ్‌లోని DLF ప్రాంతంలో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను రూ.52.3 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు వార్తతో పాటు, ఇప్పుడు ప్రైవేట్ జెట్ కొనుగోలు వార్త మరింత దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం, జూన్ 2025 నాటికి దీపిందర్ గోయల్‌కు జొమాటోలో 3.83 శాతం వాటా ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం జొమాటో మార్కెట్ విలువ ఆధారంగా, ఆయన వాటా విలువ సుమారు రూ.9,847 కోట్లుగా ఉంది. దీంతో గోయల్‌ నికర సంపద 1.6 బిలియన్ డాలర్లకు పైగా ఉందని ఫోర్బ్స్ వెల్లడించింది.

గోయల్ కొత్తగా ప్రారంభించిన LAT Aerospace వేదికగా ప్రైవేట్ జెట్ మార్కెట్‌లోకి ప్రవేశించడం వ్యాపార వ్యూహపరంగానూ, సంస్థ విస్తరణకూ ముఖ్యమైన అడుగుగా పరిశీలించవచ్చు. ఇప్పటికే కార్పొరేట్ విమానయాన రంగం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతుండగా, కొత్తగా సాంకేతికతను ప్రోత్సహించే సంస్థల అవసరం పెరిగిపోతోంది. గోయల్ కూడా తన కొత్త ప్రాజెక్ట్ ద్వారా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు. మొత్తంగా, ఫుడ్ డెలివరీ దిగ్గజం నుంచి విమానయాన రంగంలోకి మారుతున్న దీపిందర్ గోయల్ ప్రయాణం పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది కేవలం ఒక లగ్జరీ కొనుగోలే కాకుండా, ఆయన వ్యాపార దృష్టిని, పెట్టుబడి అవకాశాలపై చూపుతో కూడిన వ్యూహాత్మక ముందడుగుగా చెప్తున్నారు పరిశీలకులు.

Read Also: NCERT: ఎనిమిదో త‌ర‌గ‌తి పాఠ్య‌పుస్త‌కంలో భారీ మార్పులు!