Site icon HashtagU Telugu

Byjus – BCCI : 15వేల కోట్ల అప్పులుంటే.. బీసీసీఐ అప్పు మాత్రమే ఎందుకు చెల్లించారు.. బైజూస్‌కు ‘సుప్రీం’ ప్రశ్న

Byjus Bcci Supreme Court 15000 Crore Debt

Byjus – BCCI : ప్రముఖ ఎడ్ టెక్ కంపెనీ బైజూస్ దాదాపు రూ.15వేల కోట్ల అప్పుల్లో ఉంది. తమ కంపెనీకి అప్పులు ఇచ్చిన చాలా సంస్థలకు వాటిని తిరిగి చెల్లించలేని దుస్థితిలో బైజూస్ ఉంది.  అయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ)కు ఇవ్వాల్సి ఉన్న  రూ.158.90 కోట్ల బకాయిలను ఇటీవలే బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ సోదరుడు రిజు రవీంద్రన్ చెల్లించారు. ఈ అంశంపై బైజూస్‌కు  అప్పు ఇచ్చిన అమెరికన్ కంపెనీ ‘గ్లస్ ట్రస్ట్’ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని బెంచ్ దీన్ని విచారించే క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది.   ‘‘మీకు (బైజూస్‌) రూ.15వేల కోట్ల అప్పులు ఉన్నాయి. అయితే కేవలం బీసీసీఐ బకాయిలను మాత్రమే ఎందుకు కట్టారు ? మిగతా వాళ్ల పరిస్థితేంటి ?’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం(Byjus – BCCI) బైజూస్‌ను ప్రశ్నించింది.

Also Read :Pakistan : పాకిస్తాన్‌కు గుడ్ న్యూస్.. ఐఎంఎఫ్ రూ.58వేల కోట్ల లోన్

‘‘బైజూస్ కంపెనీ కొంతమందికి బకాయిలను తిరిగి చెల్లిస్తోంది. అందుకే అది దివాలా తీసినట్లుగా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ప్రకటించడం సబబు కాదు. బైజూస్ నుంచి రుణదాతలకు లోన్ల రికవరీపై విచారణ కొనసాగి తీరాలి’’ అని గ్లస్ ట్రస్ట్ కంపెనీ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదన వినిపించారు. ఈ వాదనలతో సుప్రీంకోర్టు బెంచ్ కూడా ఏకీభవించింది. ‘‘బైజూస్ నుంచి ఇటీవలే పొందిన బకాయిల మొత్తాన్ని (రూ.158.90 కోట్లు) బీసీసీఐ ప్రత్యేక బ్యాంకు అకౌంటులో ఉంచాలి. ఎందుకంటే బైజూస్ దివాలా కేసుపై విచారణను మళ్లీ ప్రారంభించాలని మేం నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆదేశించే అవకాశాలు ఉన్నాయి’’ అని  సుప్రీంకోర్టు బెంచ్  వెల్లడించింది. ఈమేరకు బీసీసీఐకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇండియన్ క్రికెట్ టీమ్ ధరించే జెర్సీపై బైజూస్ లోగోను వాడితే ఏటా కొంత మొత్తం చెల్లించేందుకు గతంలో బీసీసీఐ‌తో బైజూస్ ఒప్పందం కుదుర్చుకుంది. దానికి సంబంధించిన బకాయిలే రూ.158.90 కోట్లు.

Also Read :Israel Vs Lebanon : లెబనాన్‌పై భూతల దండయాత్రకు ఇజ్రాయెల్ రెడీ.. సైనికులకు ఆదేశాలు

ఈ లెక్కన బైజూస్‌ దివాలా కేసు మళ్లీ మొదటికొచ్చే అవకాశాలు  ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి బైజూస్ తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ సింఘ్వి, ఎన్.కె.నకుల్ వాదనలు వినిపించారు. ‘‘బీసీసీఐకి బకాయిలను బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ చెల్లించలేదు. ఆయన సోదరుడు రిజు రవీంద్రన్ వ్యక్తిగత సొమ్ము నుంచి ఆ బకాయిలను క్లియర్ చేశారు. దానిపై అభ్యంతరం ఎలా వ్యక్తం చేస్తారు ?’’ అని వారు ప్రశ్నించారు. అమెరికాకు చెందిన గ్లస్ ట్రస్ట్ కంపెనీ వాదనలతో బైజూస్ తరఫు న్యాయవాదులు విభేదించారు. బైజూస్ కంపెనీ దివాలా కేసును ఎన్‌సీఎల్ఏటీ క్లోజ్ చేయడంలో తప్పేమీ లేదన్నారు. ఈనేపథ్యంలో తదుపరిగా సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనేది వేచిచూడాలి.