Gold Rate : బంగారం ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయి. గత 50 రోజుల్లో 10 గ్రాముల బంగారం రేటు ఎంత పెరిగిందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.9,500 మేర పెరిగిపోయింది. ఈ వ్యవధిలో 10 గ్రాముల బంగారం రేటు రూ. 76,544 నుంచి రూ. 86,020కు చేరుకుంది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు 10 గ్రాములకు రూ. 87,770కి చేరుకుంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ. 80,450కి చేరింది. ఇంతకీ బంగారం రేటు ఇంతలా ఎందుకు పెరుగుతోంది ? కారణాలు ఏమిటి ?
Also Read :God Chip : ప్రపంచాన్ని మార్చేసే ‘గాడ్ చిప్’.. ఏం చేస్తుందో తెలుసా ?
బంగారం ధరను పెంచుతున్న అంశాలివే..
- ప్రపంచంలోనే అత్యధిక బంగారం నిల్వలు(Gold Rate) అమెరికాలో ఉన్నాయి. ఆ దేశంలో దాదాపు 8,133 టన్నుల బంగారం ఉంది.
- అమెరికాలోని టాప్-5 బ్యాంకులకు చెందిన బంగారం నిల్వలు ఇంగ్లండ్‌లోని వాల్ట్‌లలో భద్రపరిచి ఉండేవి. అయితే గత నెల రోజుల వ్యవధిలో అమెరికా బ్యాంకులు తమ బంగారాన్ని, ఇంగ్లండ్ వాల్ట్‌ల నుంచి వెనక్కి తెప్పించుకుంటున్నాయి.
- ప్రపంచ దేశాలు తమ బంగారం నిల్వలను దాచేందుకు భూగర్భంలో రహస్య వాల్ట్‌లను నిర్మించుకున్నాయి. ఈ వాల్ట్‌లలో అతిపెద్దది అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. న్యూయార్క్‌లో ఉన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు చెందిన వాల్ట్‌లో అత్యధిక బంగారం నిల్వలు ఉన్నాయి. దీని తర్వాత రెండో అతిపెద్ద బంగారం వాల్ట్ బ్రిటన్‌లో ఉంది. దీన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నిర్వహిస్తోంది. ఈ వాల్ట్‌లలో భారత్, చైనా సహా చాలా దేశాల బంగారం భద్రంగా దాచి ఉంది.
- ఈ సీక్రెట్ వాల్ట్‌ల నుంచి బంగారం నిల్వలను భారత్, చైనా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాలు వెనక్కి తెచ్చుకుంటున్నాయి. భవిష్యత్ ఆర్థిక సంక్షోభాలు, యుద్ధాల భయంతోనే ప్రపంచదేశాలు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
- ఐరోపా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి చేసే బంగారంపై డొనాల్డ్ ట్రంప్ సుంకాలు విధించారు. దీంతో అమెరికాలో బంగారానికి మరింతగా డిమాండ్ పెరిగింది. ధరలు కూడా పెరిగాయి.
- గత ఎనిమిది వారాల వ్యవధిలో న్యూయార్క్‌లో ఉన్న NY COMEX వాల్ట్‌లలో బంగారం నిల్వలు దాదాపు 20 మిలియన్లు పెరిగాయి. ఈ పరిణామం లండన్‌లో క్యాష్ గోల్డ్ కాంట్రాక్ట్ డిఫాల్ట్ బజ్‌కు దారితీసింది.
- అల్యూమినియం, ఉక్కుపై ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం దిగుమతి సుంకాలను విధించారు. తదుపరిగా బంగారంపై కూడా ఆయన సుంకాలు విధిస్తారనే ఆందోళనల వల్ల అమెరికాలో బంగారం ధరలు పెరిగాయి.
- భారత్‌కు చెందిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2024 మే- అక్టోబర్ కాలంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఖజానాల నుంచి 100, 102 టన్నుల బంగారాన్ని వెనక్కి తీసుకొచ్చింది. ఆర్బీఐ వద్ద మొత్తం 855 టన్నుల బంగారం నిల్వలు చేరాయి. వీటిలో 510.5 టన్నులు భారత్‌లోనే ఉన్నాయి.