హోం లోన్‌కు అప్లై చేస్తున్నారా? అయితే ఈ త‌ప్పులు చేయ‌కండి!

హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు పొరపాటున కూడా తప్పుడు సమాచారం ఇవ్వకండి. ఇది లోన్ రిజెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సరైన సమాచారాన్ని మాత్రమే అందించండి.

Published By: HashtagU Telugu Desk
Home Loan

Home Loan

Home Loan: సొంత ఇల్లు కొనాలనేది దాదాపు ప్రతి భారతీయుడి కల. అయితే పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భారీగా పెరిగిన ఆస్తుల ధరల కారణంగా చాలా మంది తమ కలను నెరవేర్చుకోవడానికి బ్యాంక్ హోమ్ లోన్ (గృహ రుణం)పై ఆధారపడాల్సి వస్తోంది. మీరు కూడా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తూ లోన్ తీసుకోవాలనుకుంటే.. బ్యాంకులు మీ దరఖాస్తులో ప్రాథమికంగా ఏయే అంశాలను పరిశీలిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

బ్యాంకులు మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్, ఉద్యోగ స్థిరత్వం వంటి అనేక అంశాలను తనిఖీ చేస్తాయి. వీటిలో ఏ ఒక్కటి సరిగ్గా లేకపోయినా మీ లోన్ అప్లికేషన్ నిలిచిపోవచ్చు లేదా రిజెక్ట్ కావచ్చు. హోమ్ లోన్ పొందేటప్పుడు మీరు జాగ్రత్త వహించాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే అని నిపుణులు చెబుతున్నారు.

సిబిల్ స్కోర్‌పై నిఘా

హోమ్ లోన్ మాత్రమే కాకుండా ఏ ఇతర లోన్ తీసుకోవాలన్నా మీ సిబిల్ స్కోర్ అత్యంత ముఖ్యం. మీ స్కోర్ బ్యాంక్ నిర్ణయించిన పరిమితి కంటే తక్కువగా ఉంటే లోన్ దరఖాస్తు తిరస్కరించబడుతుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంటే లోన్ వచ్చే అవకాశాలు పెరగడమే కాకుండా తక్కువ వడ్డీ రేట్లకే రుణం పొందే వెసులుబాటు కూడా ఉంటుంది.

ఆదాయ పరిమితి

హోమ్ లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు దరఖాస్తుదారుని ఆదాయ వివరాలను సేకరిస్తాయి. ప్రతి బ్యాంకులో కనీస ఆదాయ పరిమితి ఉంటుంది. మీ సంపాదన ఆ పరిమితి కంటే తక్కువగా ఉంటే లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీ ఆదాయాన్ని బట్టే మీకు ఎంత మొత్తంలో లోన్ ఇవ్వాలో బ్యాంకులు నిర్ణయిస్తాయి.

Also Read: 2026లో భారత్‌లోకి వస్తున్న 15 కొత్త SUVలు ఇవే!

ఉద్యోగ స్థిరత్వం చాలా అవసరం

మీ ఉద్యోగం ఎంత స్థిరంగా ఉందో బ్యాంకులు మొదట గమనిస్తాయి. మీరు తరచుగా ఉద్యోగాలు మారుస్తున్నా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నా లేదా మీ ఆదాయం క్రమబద్ధంగా లేకపోయినా మీరు లోన్ తిరిగి చెల్లించగలరా లేదా అనే విషయంలో బ్యాంకులకు అనుమానం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో లోన్ మంజూరు కావడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.

తప్పుడు సమాచారం ఇవ్వకండి

హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు పొరపాటున కూడా తప్పుడు సమాచారం ఇవ్వకండి. ఇది లోన్ రిజెక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం కావచ్చు. కాబట్టి అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, సరైన సమాచారాన్ని మాత్రమే అందించండి. ఏదైనా విషయంలో మీకు సందేహం ఉంటే నేరుగా బ్యాంకు అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవడం ఉత్తమం.

  Last Updated: 03 Jan 2026, 08:08 PM IST