Credit Cards: భారతదేశంలో క్రెడిట్ కార్డ్ సంస్కృతి వేగంగా పెరుగుతోంది. వినియోగదారులను ఆకర్షించడానికి బ్యాంకులు రకరకాల ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు ప్రకటిస్తుంటాయి. క్రెడిట్ కార్డ్ అంటే.. మనం బ్యాంక్ నుండి అప్పుగా డబ్బు తీసుకుని వస్తువులు కొనుక్కుని, సుమారు 45 రోజుల తర్వాత తిరిగి చెల్లించడం. సమయానికి చెల్లిస్తే రివార్డులు వస్తాయి, కానీ బ్యాంకులు మాత్రం భారీ లాభాలను ఆర్జిస్తాయి.
బ్యాంకులు ఎలా సంపాదిస్తాయి?
RBI గణాంకాల ప్రకారం.. 2025 ప్రారంభం నాటికి భారతదేశంలో యాక్టివ్ క్రెడిట్ కార్డుల సంఖ్య 11 కోట్లు దాటింది. బ్యాంకులు ప్రధానంగా వడ్డీ రేట్లు, వివిధ ఛార్జీల ద్వారా లాభం పొందుతాయి.
భారీ వడ్డీ: ఒకవేళ మీరు బిల్లును సమయానికి చెల్లించకపోతే మిగిలిన మొత్తంపై బ్యాంకులు 15% నుండి 40% వరకు భారీ వడ్డీని వసూలు చేస్తాయి.
ఇతర ఛార్జీలు: యాన్యువల్ ఫీజు, లేట్ పేమెంట్ ఫీజు, EMI కన్వర్షన్ ఫీజు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఫీజు వంటి వాటి ద్వారా కూడా బ్యాంకులకు మంచి ఆదాయం వస్తుంది.
Also Read: 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?
ఇంటర్‌ఛేంజ్ ఫీజు అంటే ఏమిటి?
మీరు క్రెడిట్ కార్డ్‌తో ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ దుకాణదారుడు లేదా వ్యాపారి బ్యాంక్‌కు ట్రాన్సాక్షన్ మొత్తంలో 1-3 శాతం కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. దీనినే ‘ఇంటర్‌ఛేంజ్ ఫీజు’ అంటారు. ఇది నేరుగా బ్యాంకు ఖాతాలోకి వెళ్తుంది.
క్యాష్ అడ్వాన్స్ ఫీజు
క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ATM నుండి నగదు విత్ డ్రా చేస్తే బ్యాంకులు 2.5% నుండి 5% వరకు ఫీజు వసూలు చేస్తాయి. దీనికి ఎలాంటి గ్రేస్ పీరియడ్ (అదనపు సమయం) ఉండదు. మీరు డబ్బు తీసిన రోజు నుండే వడ్డీ పడటం మొదలవుతుంది.
ఉదాహరణ: మీరు రూ. 10,000 విత్ డ్రా చేస్తే, 3% ఫీజు అనుకుంటే.. వెంటనే రూ. 300 బ్యాంక్ సంపాదిస్తుంది. దీనికి తోడు రోజువారీ వడ్డీ అదనం.
పెరుగుతున్న క్రెడిట్ కార్డ్ ఖర్చులు
జనవరి 2025లో భారత దేశంలో క్రెడిట్ కార్డ్ ఖర్చులు 10.8% పెరిగి రూ. 1.84 ట్రిలియన్లకు (రూ. 1,84,000 కోట్లు) చేరాయి. క్రెడిట్ కార్డును సరిగ్గా వాడితే క్రెడిట్ హిస్టరీ మెరుగుపడుతుంది. ఇది భవిష్యత్తులో లోన్లు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. క్యాష్‌బ్యాక్, లాయల్టీ పాయింట్లు వినియోగదారులను మళ్ళీ మళ్ళీ ఖర్చు చేసేలా ప్రోత్సహిస్తాయి.
అయితే క్రెడిట్ కార్డుల దుర్వినియోగం పెరగడంతో RBI, బ్యాంకులు తమ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. క్రెడిట్ కార్డ్ అనేది ఒక వెసులుబాటు మాత్రమే. దానిని బాధ్యతాయుతంగా వాడకపోతే అప్పుల ఊబిలో పడే ప్రమాదం ఉంది.
