Air India Planes: ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ 787-8 అహ్మదాబాద్-లండన్ ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే కూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మొత్తం 274 మంది మృతిచెందారు. భారతదేశంలో జరిగిన విమానాల ప్రమాదాల చరిత్రలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇదే. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ (Air India Planes) AI171, టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఒక మెడికల్ హాస్టల్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత మంటల్లో చిక్కుకుంది. ఈ దుర్ఘటనలో కనీసం 274 మంది మరణించారు. కొత్త సాక్ష్యాలు బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్‌లోని రెండు ఇంజన్లు విఫలమైనట్లు లేదా పూర్తి ఎలక్ట్రికల్ లేదా హైడ్రాలిక్ వైఫల్యం ఏర్పడినట్లు సూచిస్తున్నాయి.
RAT (రామ్ ఎయిర్ టర్బైన్) అంటే ఏమిటి?
జూన్ 12న జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన స్పష్టమైన ఆడియో, వీడియో సాక్ష్యాలు రామ్ ఎయిర్ టర్బైన్ (RAT) గురించి వెల్లడిస్తున్నాయి. RAT అనేది ఒక చిన్న ప్రొపెల్లర్ లాంటి పరికరం. ఇది రెండు ఇంజన్ల వైఫల్యం లేదా పూర్తి ఎలక్ట్రికల్ లేదా హైడ్రాలిక్ వైఫల్యం సంభవించినప్పుడు స్వయంచాలకంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. జెట్ ఇంజన్ల గర్జన లేనప్పుడు RAT ప్రత్యేకమైన గట్టి శబ్దం ఆడియోలో స్పష్టంగా వినిపిస్తుంది. వీడియోలో దాని డిప్లాయ్‌మెంట్ కనిపిస్తుంది. ఇందులో విమానం ఎత్తు కోల్పోతూ.. వేగంగా కిందకు దిగుతున్నట్లు చూపిస్తుంది.
Also Read: Starbucks: స్టార్‌బక్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా చాయ్‌వాలా.. అసలు నిజమిదే!
RAT గాలి వేగాన్ని ఉపయోగించి అత్యవసర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. నిపుణుల ప్రకారం దీని డిప్లాయ్‌మెంట్ మూడు సంభావ్య సందర్భాలను సూచిస్తుంది.
- విమానం రెండు ఇంజన్లు విఫలమవడం
- ఎలక్ట్రానిక్ వైఫల్యం
- హైడ్రాలిక్ వైఫల్యం
పైలట్ ఏమి చెప్పారు?
భారత వైమానిక దళం అనుభవజ్ఞుడైన పైలట్, విమాన నిపుణుడు కెప్టెన్ ఎహసాన్ ఖలీద్, వీడియో సాక్ష్యాలు బయటకు వచ్చిన తర్వాత దుర్ఘటన రోజునే రెండు ఇంజన్ల వైఫల్యంపై అనుమానం వచ్చిందని తెలిపారు. విమానం ‘యాయింగ్’ (అస్థిరంగా కదలడం) చేస్తున్నట్లు కనిపించిందని, ఒకే సమయంలో రెండు ఇంజన్లలో పక్షులు ఢీకొనడం దాదాపు అసాధ్యమని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. దాదాపు అందరూ రెండు ఇంజన్ల వైఫల్యం గురించి అనుమానించారు. దుర్ఘటనలో బతికిన ఏకైక వ్యక్తి కూడా ఒక శబ్దం విన్నానని, అది RAT డిప్లాయ్ అయిన శబ్దం కావచ్చని చెప్పాడు. ఇంజన్ నడుస్తున్న శబ్దం, ప్రొపెల్లర్ తిరిగే శబ్దం లేదా వేగం పెరిగే శబ్దం కావచ్చు. అతను ఎరుపు, నీలం రంగు లైట్లు చూశానని చెప్పాడు. ఇవి అత్యవసర విద్యుత్ కనెక్షన్, అత్యవసర లైట్లు వెలిగినవి కావచ్చు అని పేర్కొన్నాడని ఖలీద్ పేర్కొన్నారు.