Site icon HashtagU Telugu

Money Mool Accounts : దడ పుట్టిస్తున్న ‘మనీ మూల్‌ అకౌంట్స్’.. బ్యాంకులకు పెనుసవాల్

Money Mule Account

Money Mool Accounts :  ‘మనీ మూల్‌ అకౌంట్’ అంటే ఏమిటో తెలుసా ? ఈ మధ్యకాలంలో దీని గురించి ఎంతో చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏమిటిది ? ఈ అకౌంటును ఎవరు వాడుతారు ? ఎందుకు వాడుతారు ? ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

మనీ మూల్‌ అకౌంట్లు(Money Mool Accounts) ఇప్పుడు బ్యాంకులకు పెద్ద సవాలుగా మారాయి. వీటిని గుర్తించడం బ్యాంకులకు తలకు మించిన భారంగా మారింది. ఆర్థికంగా సమస్యల్లో ఉన్నవారితో సైబర్ కేటుగాళ్లు మనీ మూల్‌ అకౌంట్లు తెరిపిస్తున్నారు. తొలుత సైబర్ కేటుగాళ్లు జాబ్ ఇస్తామని ఊరిస్తారు. ప్రతినెలా శాలరీ వేయడానికి ఫలానా బ్యాంకులో అకౌంటు తెరవమని సూచిస్తారు. అయితే ఆ అకౌంటుకు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్ వర్డ్, డెబిట్ కార్డు, ఫోన్ నంబరు అన్నీ వాళ్ల కంట్రోల్‌లోనే ఉంచుకుంటారు. ఈ తరహాలో మనీమూల్ అకౌంట్లు తెరిపించే సైబర్ కేటుగాళ్లు కొంతకాలం పాటు వాటిలో డబ్బులు వేస్తారు. అనంతరం ఉద్యోగం పొందిన వ్యక్తికి ఆ మనీమూల్ అకౌంటు నుంచి డబ్బులు వేయడం ఆపేస్తారు.

అకౌంటును ఎలా దుర్వినియోగం చేస్తారంటే.. 

ఇక ఆ అకౌంటును బ్లాక్ మనీని డిపాజిట్‌ చేయడానికి, మోసపూరిత సొమ్మును బదిలీ చేయడానికి, ఆన్‌లైన్‌ జూదానికి, సైబర్‌ మోసాలకు వాడేస్తారు. ఈవిధంగా మనీమూల్ అకౌంట్లలోకి భారీగా సొమ్ము వచ్చి వెళ్లిపోతుంటుంది.  ఈవివరాలన్నీ ఖాతాదారుడికి చేరవు. ఎందుకంటే దానితో అతడి ఫోన్ నంబరు కూడా లింకై ఉండదు. కొంతకాలం తర్వాత ఆ అక్రమ లావాదేవీల చిట్టా పోలీసులకు చేరగానే..  అకౌంటు ఎవరి పేరిట ఉందో వాళ్లను వెతుక్కుంటూ పోలీసులు వెళ్తారు. అకౌంటులో డిపాజిట్ చేసిన ఆ భారీ నగదు గురించి ఆరా తీస్తారు. ఆదాయపు పన్ను విభాగం నుంచి కూడా నోటీసులు వస్తాయి.  ఆ సమయంలో తాను మోసపోయానని గ్రహించి బాధపడటం తప్ప బాధితుడికి ఏమీ  మిగలదు. పైగా పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే మన పేరిట, మన ఐడీ ప్రూఫ్‌లతో బ్యాంకు అకౌంట్లను క్రియేట్ చేసే స్వేచ్ఛను ఇతరులకు ఇవ్వకూడదు.

Also Read :Rajiv Park : న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో హైదరాబాద్‌లో రాజీవ్ పార్క్‌.. ఎలా ఉంటుందంటే ?

మనీ మూల్‌ అకౌంట్ల సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఫోకస్ పెట్టింది. బెంగళూరులోని ఆర్‌బీఐ ఇన్నోవేషన్‌ హబ్, కెనరా బ్యాంకు కలిసి కృత్రిమ మేధ/ మెషీన్‌ లెర్నింగ్‌ (ఏఐ/ఎంఎల్‌) ఆధారిత టూల్‌ను డెవలప్ చేశాయి. మనీ మూల్ అకౌంట్లను పసిగట్టడం, వాటికి అడ్డుకట్ట వేయడమే ఈ టూల్‌ ఉద్దేశం. బ్యాంకు ఖాతాలో జరిగే లావాదేవీల ఆధారంగా అకౌంటు ఎలాంటిది అనే విషయాన్ని గుర్తించగలగడం ఈ టూల్ ప్రత్యేకత. ప్రస్తుతం కెనరా బ్యాంకులో ప్రయోగాత్మకంగా దీన్ని వినియోగిస్తున్నారు.  మనీ మూల్‌ ఖాతాలను 90 శాతం కచ్చితత్వంతో ఇది గుర్తిస్తోంది.

Also Read :Railway Jobs : 1376 రైల్వే జాబ్స్.. అన్నీ పారామెడికల్ పోస్టులే