UPI Transactions: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) డిజిటల్ చెల్లింపులలో భద్రతను మెరుగుపరిచేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2025 అక్టోబర్ 1 నుండి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI Transactions)లో పీర్-టు-పీర్ (P2P) ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రధానంగా ఈ ఫీచర్‌ను ఉపయోగించి జరుగుతున్న ఆర్థిక మోసాలను అరికట్టడానికే ఉద్దేశించబడింది.
P2P ‘కలెక్ట్ రిక్వెస్ట్’ అంటే ఏమిటి?
P2P ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ ద్వారా ఒక యూజర్ మరొక యూజర్‌కు డబ్బులు పంపమని ఒక అభ్యర్థన (request) పంపవచ్చు. రిసీవర్ ఈ అభ్యర్థనను ఆమోదించి, తన UPI పిన్ నమోదు చేసిన తర్వాత డబ్బు పంపిన వారి ఖాతా నుండి డబ్బు కట్ అవుతుంది. ఈ ఫీచర్ మొదట్లో స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు పెండింగ్ చెల్లింపులను గుర్తు చేయడానికి, లావాదేవీలను సులభతరం చేయడానికి రూపొందించబడింది.
ఎందుకు నిలిపివేస్తున్నారు?
NPCI ప్రకారం.. ఈ ఫీచర్ స్కామర్లకు ఒక సులభమైన మార్గంగా మారింది. మోసగాళ్లు నకిలీ గుర్తింపులు లేదా అత్యవసర పరిస్థితులను అడ్డం పెట్టుకుని యూజర్లకు డబ్బుల కోసం రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. అమాయక యూజర్లు ఆ రిక్వెస్ట్‌ను నిజమని నమ్మి ఆమోదించి, UPI పిన్ నమోదు చేసిన వెంటనే, వారి ఖాతా నుండి డబ్బులు తక్షణమే ఉపసంహరించుకుంటారు. ఈ మోసాల పెరుగుదల కారణంగానే NPCI ఈ ఫీచర్‌ను తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఒక P2P కలెక్ట్ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ. 2,000, ఒక రోజులో గరిష్టంగా 50 విజయవంతమైన క్రెడిట్ ట్రాన్సాక్షన్లు చేయవచ్చు. అయితే, ఈ లిమిట్స్ ఉన్నప్పటికీ మోసాలు కొనసాగుతున్నాయి.
Also Read: Supreme Court: బీహార్‌లో తొలగించిన ఓటర్ల జాబితాను బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం!
2025 అక్టోబర్ 1 తర్వాత P2P ‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ వ్యక్తిగత లావాదేవీల నుండి పూర్తిగా తొలగించబడుతుంది. అంటే ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లలో ఒక యూజర్ మరొక యూజర్ నుండి డబ్బులు అడగడానికి ఈ ఫీచర్‌ను ఉపయోగించలేరు. ఈ మార్పు వ్యాపారుల లావాదేవీలపై ప్రభావం చూపదు. వ్యాపారాలు తమ కస్టమర్ల నుండి చెల్లింపుల కోసం ‘కలెక్ట్ రిక్వెస్ట్’ను ఉపయోగించడం కొనసాగించవచ్చు. ఉదాహరణకు, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్విగ్గీ, IRCTC వంటి ప్లాట్‌ఫారమ్‌లలో చెల్లింపులు యధావిధిగా జరుగుతాయి.
భవిష్యత్తులో చెల్లింపుల విధానం
‘కలెక్ట్ రిక్వెస్ట్’ ఫీచర్ తొలగించిన తర్వాత యూజర్లు డబ్బులు పంపడానికి లేదా అడగడానికి ఈ క్రింది పద్ధతులను ఉపయోగించవచ్చు.
- QR కోడ్ స్కాన్: స్కాన్ చేసి డబ్బులు పంపడం.
- మొబైల్ నంబర్/UPI ID: మొబైల్ నంబర్ లేదా UPI ఐడీని ఎంచుకుని చెల్లింపు చేయడం.
- ఖాతా నంబర్: అకౌంట్ నంబర్ మరియు IFSC కోడ్ ఉపయోగించి నేరుగా డబ్బు పంపడం.
భారతదేశంలో UPI అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపు పద్ధతిగా మారింది. ఇది ప్రతి నెలా సుమారు 20 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. NPCI తీసుకున్న ఈ నిర్ణయం యూజర్లను మోసాల నుండి రక్షించడం ద్వారా UPI లావాదేవీలలో మరింత భద్రత, విశ్వాసాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.