భారతదేశంలో డిజిటల్ లావాదేవీల వినియోగంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) కీలక భూమిక పోషిస్తోంది. జులై 2025లో యూపీఐ ద్వారా రూ.25.1 లక్షల కోట్ల విలువైన 1,947 కోట్ల లావాదేవీలు జరగడం గమనార్హం. ఈ గణాంకాలు గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ట్రాన్సాక్షన్ వాల్యూలో 22 శాతం, వాల్యూమ్‌లో 35 శాతం వృద్ధిని చూపిస్తున్నాయి. డిజిటల్ పేమెంట్స్ విభాగంలో యూపీఐ ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఈ సంఖ్యలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.
జూన్ నెలలో రోజుకి సగటుగా 61.3 కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ్గా, జులైలో ఈ సంఖ్య 62.8 కోట్లకు చేరుకుంది. అలాగే, రోజువారీ లావాదేవీల విలువ కూడా జూన్‌లో రూ.80,131 కోట్ల నుండి జులైలో రూ.80,919 కోట్లకు పెరిగింది. ఇది నగదు రహిత లావాదేవీలకు ప్రజలు మరింత అలవాటుపడుతున్నారన్న సంకేతాలను ఇస్తోంది. ముఖ్యంగా టైర్ 2, టైర్ 3 పట్టణాల్లోనూ యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతుండడం గమనార్హం.
Duvvada Srinivas : నిను వీడని నీడను నేనే అంటూ ‘ దువ్వాడ ‘ ను వదలని ‘వైసీపీ నీడ’
యూపీఐ ట్రాన్సాక్షన్ల ఈ పెరుగుదలకు ప్రభుత్వ ప్రమోషన్, ఫ్రీ సర్వీస్‌లు, సులభతర యాక్సెస్ ప్రధాన కారణాలు. అప్పు, రికరింగ్ పేమెంట్స్ వంటి కొత్త ఫీచర్లను యూపీఐలో ప్రవేశపెట్టడం ద్వారా వినియోగదారులకు మరింత సౌలభ్యం కల్పించారు. NPCI మరియు ప్రభుత్వ ప్రోత్సాహంతో, యూపీఐ సేవలు గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరించాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను డిజిటల్ వైపు మరింతగా నెట్టుతుంది.
ప్రపంచంలో జరిగే డిజిటల్ లావాదేవీలలో 50 శాతం వరకు కేవలం భారత్‌లోనే జరగడం గర్వకారణంగా మారింది. యూపీఐ ద్వారా 85 శాతం డిజిటల్ పేమెంట్స్ నిర్వహించబడుతున్నాయి. QR కోడ్ పేమెంట్స్, బిల్ పేమెంట్స్, బ్యాలెన్స్ చెకింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి సదుపాయాలు UPIని మరింత ప్రజాదరణ పొందేలా చేశాయి. 2016లో ప్రారంభమైన UPI ఇప్పుడు గ్లోబల్ ఫినాన్షియల్ టెక్నాలజీ రంగంలో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆధునిక ఆవిష్కరణగా నిలిచింది.