Gold- Silver Prices: గడిచిన ఏడాది కాలంలో బంగారం, వెండి తమ పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించాయి. ముఖ్యంగా వెండి తన ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్‌తో సంతోషాన్ని ఇచ్చింది. అయితే బంగారం, వెండి ధరల్లో వస్తున్న రికార్డు స్థాయి పెరుగుదల ఈ విలువైన లోహాలను సామాన్యులకు అందుబాటులో లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్ 2026లో బంగారం, వెండికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు వెలువడవచ్చని, అవి ధరలపై ప్రభావం చూపుతాయని సామాన్యులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటనకు ముందు మార్కెట్లో బంగారం, వెండి ధరల విషయంలో చాలా సందడి నెలకొంది. ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై సామాన్య ప్రజలతో పాటు జ్యువెలరీ పరిశ్రమ కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. అయితే బడ్జెట్ తర్వాత బంగారం ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా అనే విషయంపై నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
Also Read: పసిపిల్లలకు ఆవు పాలు ఎప్పుడు ఇవ్వాలో తెలుసా?!
బంగారం, వెండి చౌకగా మారే అవకాశం ఉందా?
ప్రస్తుతం బంగారం, వెండిపై దిగుమతి సుంకం 6%గా ఉంది. జ్యువెలర్లు, అనేక వ్యాపార సంస్థలు దీనిని 4%కి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అంగీకరిస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధర ప్రతి 10 గ్రాములకు రూ. 2,000 నుండి రూ. 4,000 వరకు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆభరణాలపై ఉన్న GSTని 3% నుండి 1.25% – 1.5%కి తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. అదే జరిగితే నగలు కొనడం మరింత చౌకగా మారుతుంది.
ధరలు పెరిగే ప్రమాదం ఉందా?
రూపాయితో పోలిస్తే డాలర్ బలపడటం, వాణిజ్య లోటును తగ్గించడం కోసం ప్రభుత్వం డ్యూటీని పెంచవచ్చనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ భయంతోనే గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ ధరల కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. మరికొందరు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బడ్జెట్ నిర్ణయాలు ఎలా ఉన్నా రష్యా-ఉక్రెయిన్ లేదా మధ్యప్రాచ్య ఉద్రిక్తతల వంటి అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ధరలు పెరిగే అవకాశమే ఉంది.
ప్రస్తుత ధరలు- అంచనాలు
ప్రస్తుతం MCXలో బంగారం (24K) 10 గ్రాములకు సుమారు రూ 1.56 లక్షల వద్ద ఉంది. వెండి కిలోకు సుమారు రూ. 3.35 లక్షల స్థాయిని తాకింది. నిపుణుల అంచనా ప్రకారం.. బడ్జెట్‌లో డ్యూటీ తగ్గించకపోతే 2026 చివరి నాటికి బంగారం ధర రూ. 1.75 లక్షలకు, వెండి ధర రూ. 4 లక్షలకు చేరుకోవచ్చు.
