GST: రాజధానిలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ప్యూరిఫైయర్‌లపై జీఎస్టీని తగ్గించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తన నిర్ణయాన్ని తెలిపింది. ఎయిర్ ప్యూరిఫైయర్‌లపై పన్ను తగ్గించడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. అంతకుముందు రోజు ఈ విషయంపై ఆలోచించాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి సూచించిన సంగతి తెలిసిందే.
జీఎస్టీని తగ్గించడానికి నిరాకరించడానికి కారణాలు
జస్టిస్ వికాస్ మహాజన్, వినోద్ కుమార్లతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. కేంద్రం తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్. వెంకట్రామన్ ఈ క్రింది కారణాలను కోర్టుకు వివరించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం ప్రకారం.. ఎయిర్ ప్యూరిఫైయర్‌లను వైద్య పరికరాలుగా పరిగణించలేమని పేర్కొంది. వస్తువుల వర్గీకరణ, జీఎస్టీ రేట్లను నిర్ణయించడం అనేది సుదీర్ఘమైన చట్టపరమైన ప్రక్రియ. దీనిని జీఎస్టీ కౌన్సిల్ నిర్వహిస్తుంది. ఒకవేళ ఎయిర్ ప్యూరిఫైయర్‌లపై పన్ను తగ్గించినట్లయితే ఇతర రంగాల నుండి కూడా ఇలాంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి సహా ఉన్నత స్థాయి విధాన విభాగం పరిశీలించిందని, పన్ను రేట్లను మార్చాలని కోర్టులు జీఎస్టీ కౌన్సిల్‌ను ఆదేశించలేవని వెంకట్రామన్ పేర్కొన్నారు.
Also Read: ధురంధర్ ప్రభంజనం.. రూ. 1,000 కోట్ల క్లబ్‌లో చేరిన రణవీర్ సింగ్ చిత్రం!
హైకోర్టు వ్యాఖ్యలు
కాలుష్య పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ ధర రూ. 10,000 నుండి రూ. 15,000 మధ్యలో ఉంటుంది. ఇంత ధర ఉంటే పేద కుటుంబాలు వీటిని ఎలా కొనుగోలు చేయగలవని కోర్టు ప్రశ్నించింది. కాలుష్యం అనేది ధనిక, పేద అనే తేడా లేకుండా అందరినీ ప్రభావితం చేస్తుందని, ఇది దేశం మొత్తానికి సంబంధించిన సమస్య అని కోర్టు పేర్కొంది.
పిటిషనర్ వాదన
పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ మదాన్ మాట్లాడుతూ.. తాను పన్నును పూర్తిగా తొలగించాలని కోరడం లేదని, ప్రస్తుత జీఎస్టీ నిబంధనల ప్రకారం వీటిని సరైన విభాగంలో వర్గీకరించాలని కోరుతున్నట్లు తెలిపారు. తక్కువ జీఎస్టీ ఉండే మెడికల్ డివైస్‌ల విభాగంలో ఉంచాల్సింది పోయి, వీటిని తప్పుగా అధిక పన్ను స్లాబ్‌లో ఉంచారని ఆయన వాదించారు. ప్రస్తుతానికి ఎటువంటి మధ్యంతర ఉపశమనం ఇవ్వలేమని కోర్టు తెలిపింది. 10 రోజుల్లోగా దీనిపై వివరణాత్మక సమాధానం దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ కోర్టు సెలవుల తర్వాత జనవరి 9న జరగనుంది.
