Tatkal Ticket Booking: భారతీయ రైల్వే తత్కాల్ టికెట్ బుకింగ్ (Tatkal Ticket Booking) నియమాలలో కీలక మార్పులు చేసింది. కొత్త నియమాల ప్రకారం.. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక రోజులో గరిష్టంగా రెండు తత్కాల్ టికెట్లను మాత్రమే బుక్ చేసుకోగలరు. ఈ నియమాలు జూలై 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. రైల్వే తీసుకొచ్చిన ఈ మార్పుల ఉద్దేశ్యం నకిలీ బుకింగ్‌లను అరికట్టడం, నిజమైన ప్రయాణికులకు టికెట్లు లభించేలా చూడటమే అని రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఆధార్ లింకింగ్ తప్పనిసరి
కొత్త నియమాల ప్రకారం.. తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే మీ IRCTC ఖాతా తప్పనిసరిగా ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. ఒకవేళ మీ ఖాతా ఆధార్‌తో లింక్ చేయకపోతే మీరు తత్కాల్ టికెట్‌ను బుక్ చేసుకోలేరు. ఇది ఫేక్ బుకింగ్‌లను నిరోధించడానికి ఒక కీలకమైన చర్య.
బుకింగ్ పరిమితి, ప్రయాణికుల సంఖ్య
- రైల్వే కొత్త నియమం ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజులో కేవలం రెండు తత్కాల్ టికెట్లను మాత్రమే బుక్ చేసుకోగలడు.
- ఒక టికెట్‌పై (ఒక పీఎన్‌ఆర్‌పై) గరిష్టంగా 4 మంది ప్రయాణికులకు బుకింగ్ చేసుకోవచ్చు.
- ఈ విధంగా రెండు టికెట్లపై మొత్తం 8 మంది ప్రయాణికులకు బుకింగ్ చేసుకోవచ్చు.
- ఒకవేళ మీరు అంతకంటే ఎక్కువ మందికి బుక్ చేయాలనుకుంటే మీరు వేరే IRCTC ఖాతాను ఉపయోగించాల్సి ఉంటుంది. లేదా రైల్వే కౌంటర్ లేదా అధీకృత ఏజెంట్ ద్వారా టికెట్ పొందవచ్చు.
Also Read: US Tariff: భారతదేశంపై 25 శాతం సుంకం స్టార్ట్.. ఈ రంగంపై భారీ ఎఫెక్ట్!
ఎందుకు ఈ మార్పులు?
తత్కాల్ టికెట్ బుకింగ్ ప్రక్రియలో నకిలీ బుకింగ్‌ల వల్ల చాలా మంది ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకే వ్యక్తి అనేక ఖాతాల ద్వారా ఎక్కువ టికెట్లు బుక్ చేసి బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకోవడం వంటి అక్రమాలను అరికట్టడానికి ఈ కొత్త పరిమితిని తీసుకొచ్చారు. దీనివల్ల నిజమైన అవసరాలు ఉన్న ప్రయాణికులకు తత్కాల్ టికెట్లు సులభంగా లభిస్తాయని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ఈ కొత్త నియమాలను పాటించకపోతే తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలో మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రయాణికులు ఈ నియమాలను గుర్తుంచుకుని, తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవడం మంచిది.