. ప్రస్తుతం స్వచ్ఛందంగానే వెండి హాల్‌మార్కింగ్
. HUID నంబర్‌తో వినియోగదారులకు భరోసా
. సవాళ్లు, స్వచ్ఛత ప్రమాణాలు
Hallmarking to Silver: బంగారం ధరలతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్టుబడుల కోసం, ఆభరణాల వినియోగం కోసం వెండిపై ప్రజల ఆసక్తి పెరుగుతున్న ఈ సమయంలో మోసాల ముప్పు కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాల రక్షణ కోసం వెండికీ బంగారం తరహాలోనే తప్పనిసరి హాల్‌మార్కింగ్ అమలు చేయాలన్న దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు ప్రారంభించింది. ఈ విషయాన్ని భారతీయ ప్రమాణాల మండలి (BIS) డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్ వెల్లడించారు.
ఇప్పటికే బంగారానికి హాల్‌మార్కింగ్ తప్పనిసరిగా అమలులో ఉన్నప్పటికీ, వెండికి మాత్రం ఇంకా స్వచ్ఛంద విధానమే కొనసాగుతోంది. అయితే వెండి ఆభరణాలు, వెండి వస్తువుల్లో స్వచ్ఛతపై అనుమానాలు పెరుగుతుండటంతో పరిశ్రమ వర్గాలు కూడా తప్పనిసరి హాల్‌మార్కింగ్ కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కేంద్రం అవసరమైన మౌలిక వసతులు, ల్యాబ్‌లు, తనిఖీ వ్యవస్థలపై అధ్యయనం చేస్తున్నట్లు సంజయ్ గార్గ్ తెలిపారు. సరైన వనరులు సిద్ధమైన తర్వాతే నిబంధనలు తీసుకువస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుతం స్వచ్ఛంద హాల్‌మార్కింగ్ కింద వెండి వస్తువులపై హాల్‌మార్క్‌తో పాటు యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID)ను ముద్రిస్తున్నారు. ఈ నంబర్ ద్వారా వినియోగదారులు తాము కొనుగోలు చేసిన వెండి వస్తువులో ఎంత శాతం స్వచ్ఛత ఉందో సులభంగా నిర్ధారించుకోవచ్చు. దీంతో మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. గణాంకాల ప్రకారం 2024లో హాల్‌మార్క్ ఉన్న వెండి వస్తువుల సంఖ్య సుమారు 31 లక్షలుగా ఉండగా, 2025 నాటికి అది 51 లక్షలకు పెరిగింది. ఇది వెండి హాల్‌మార్కింగ్‌పై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని సూచిస్తోంది.
అయితే వెండి హాల్‌మార్కింగ్ అమలులో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయని బీఐఎస్ అధికారులు చెబుతున్నారు. వెండిని కరిగించి చిన్నచిన్న ఆభరణాలుగా తయారు చేయడం, తక్కువ విలువైన వస్తువులకు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం కొంత కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ వినియోగదారుల భద్రత కోసమే ఈ విధానం అవసరమని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం వెండి ఆభరణాలకు 800, 835, 925, 958, 970, 990, 999 వంటి స్వచ్ఛత ప్రమాణాలతో హాల్‌మార్కింగ్ అందిస్తున్నారు. భవిష్యత్తులో ఇది తప్పనిసరి అయితే వెండి మార్కెట్ మరింత పారదర్శకంగా మారే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
