Silver Rate : ఈ ఏడాదిలో బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగ్గా.. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా దిగొచ్చాయి. ఒక్కసారిగా కరెక్షన్‌కు గురయ్యాయి. వెండి ధర ఇప్పుడు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు ఒక్కసారిగా రూ. 23 వేలు తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రాఫిట్ బుకింగ్ జరిగినట్లు తెలుస్తోంది. వెండి ధరతో పాటుగానే బంగారం ధర కూడా భారీగా దిగొచ్చింది. లేటెస్ట్ రేట్లు చూద్దాం.
ఆల్ టైమ్ గరిష్ఠాల నుంచి వెండి ఒక్కసారిగా కుప్పకూలింది. సోమవారం ఇంట్రాడే నుంచి మంగళవారం ఉదయం వరకు భారీగా దిగొచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు ఒక దశలో 84 డాలర్ల వద్ద ఆల్ టైమ్ హైని తాకి.. మళ్లీ సోమవారం రాత్రి ఒక దశలో ఇది 15 శాతానికిపైగా తగ్గి 70 డాలర్ల స్థాయిలోనూ కదలాడింది. ఇప్పుడు ఇది 74 డాలర్ల స్థాయిలో ఉంది. దీంతో దేశీయంగా కూడా వెండి ధర భారీగా దిగొచ్చింది. కిందటి రోజు ఎంసీఎక్స్ ఫ్యూచర్స్‌లో గంటలోనే వెండి ధర రూ. 21 వేలు తగ్గినట్లు చూయించగా.. ఇవాళ (మంగళవారం) చూస్తే అది ఏకంగా రూ. 23 వేలు దిగొచ్చింది. దీంతో కొనుగోలుదారులకు కాస్త ఉపశమనం లభించినట్లయింది.
దేశీయంగా హైదరాబాద్ నగరంలో చూస్తే వెండి ధర ఇప్పుడు ఒక్కసారిగా రూ. 23 వేలు తగ్గి కిలోకు రూ. 2.58 లక్షల వద్ద ఉంది. కిందటి రోజు రూ. 4 వేలు తగ్గగా.. 2 రోజుల్లోనే రూ. 27 వేలు దిగొచ్చింది. 2 రోజుల కిందట ఇది రూ. 2.81 లక్షల వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. మరి ఇప్పుడు వెండి ధర ఒక్కసారిగా ఈ స్థాయిలో తగ్గేందుకు కారణాల్ని చూద్దాం.
వెండి ధర తగ్గేందుకు ప్రధాన కారణం రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడమేనని తెలుస్తోంది. రష్యాతో ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు శాంతి చర్చలు దాదాపు పూర్తి కావొచ్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సాధారణంగా ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్లే సురక్షితమని భావించి.. బంగారం, వెండిపైకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గితే.. లోహాల ధరలు దిగిరావొచ్చని అంచనా. ఇప్పుడు అదే జరుగుతోంది.
దీనికి తోడు వెండిపై చైనా ఎగుమతి ఆంక్షలు విధించడం, అంతర్జాతీయ కమొడిటీ ఎక్స్చేంజీల్లోనూ ఈ లోహాల కాంట్రాక్టుల్లో మదుపరులు లాభాల స్వీకరణకు పాల్పడటం కూడా ధరలు దిగొచ్చేందుకు కారణమైంది. డాలర్, బాండ్ ఈల్డ్స్ బలపడటం కూడా బంగారం, వెండి వంటి లోహాల ఆకర్షణ తగ్గేందుకు కారణమైంది. దీంతో రేట్లు ఒక్కసారిగా దిగొచ్చాయని చెప్పొచ్చు. కొంత కాలంగా వెండికి పారిశ్రామికంగా కూడా డిమాండ్ భారీగా పెరగడం.. డిమాండ్‌కు తగినట్లుగా సప్లై లేకపోవడం వంటి కారణాలతో సిల్వర్ రేటు భారీగా పుంజుకుంది. ఈ ఏడాదిలోనే ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి వరకు చూస్తే ఏకంగా 170 శాతానికిపైగా పెరగడం గమనార్హం. ఇప్పుడు వెండి బాటలోనే బంగారం ధర కూడా కిందటి రోజు మధ్యాహ్నం నుంచి రూ. 6 వేల వరకు తగ్గింది.
