GST Revision: దేశంలో అమలవుతున్న GST చట్టంలో ఒక పెద్ద మార్పు (GST Revision) సంభవించవచ్చు. ప్రస్తుత కాంపెన్సేషన్ సెస్ స్థానంలో రెండు కొత్త సెస్‌లను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందులో ఒకటి హెల్త్ సెస్ కాగా మరొకటి క్లీన్ ఎనర్జీ సెస్. దీని ప్రభావం నేరుగా సిగరెట్లు, కోల్డ్ డ్రింక్స్, లగ్జరీ కార్లు, బొగ్గు వంటి ఉత్పత్తులపై పడుతుంది. ఈ ప్రతిపాదన ఆమోదిస్తే సామాన్య ప్రజల జేబుపై భారం పెరగడం ఖాయం.
ఈ ఉత్పత్తులపై హెల్త్ సెస్
హెల్త్ సెస్ సాధారణంగా సమాజానికి హానికరమైనవిగా పరిగణించబడే వస్తువులపై విధించనున్నారు. ఉదాహరణకు పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు, చక్కెర కలిగిన పానీయాలు. ఈ వస్తువులు ఇప్పటికే GST 28% టాక్స్ బ్రాకెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు వీటిపై అదనపు హెల్త్ సెస్ విధించాలని ప్రణాళిక ఉంది. తద్వారా ప్రజలు వీటి నుంచి దూరంగా ఉండేలా ప్రోత్సహించడం, ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరడం జరుగుతుంది.
Also Read: OG Movie: రూమర్స్ నమ్మకండి.. ఓజీ మూవీ రిలీజ్‌పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్!
క్లీన్ ఎనర్జీ సెస్ వల్ల ఖరీదైన కార్లు, బొగ్గుపై ప్రభావం
రెండవ సెస్.. క్లీన్ ఎనర్జీ సెస్ లక్ష్యం ఖరీదైన వాహనాలు, బొగ్గు వంటి కాలుష్య కారక ఇంధనాలపై పన్నును పెంచడం ద్వారా స్వచ్ఛమైన శక్తి దిశగా అడుగులు వేయడం. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరిత భారత విధానంతో ముడిపడిన చర్యగా పరిగణించబడుతుంది. దీని ద్వారా ఎలక్ట్రిక్, తక్కువ కాలుష్య సాంకేతికతలకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తున్నారు.
టాక్స్ స్లాబ్‌లలో కూడా పెద్ద మార్పు
NDTV ప్రకారం.. సెస్ మాత్రమే కాకుండా ప్రభుత్వం 12% GST స్లాబ్‌ను తొలగించడంపై కూడా ఆలోచిస్తోంది. దీని వల్ల కొన్ని ఉత్పత్తులు 5% టాక్స్ ఉన్న సరసమైన శ్రేణిలోకి వెళ్లవచ్చు. అయితే కొన్ని 18% ఉన్న ఉన్నత రేటు శ్రేణిలో చేర్చబడవచ్చు. టూత్‌పేస్ట్ వంటి రోజువారీ వస్తువులను సరసమైన టాక్స్ బ్రాకెట్‌లో ఉంచవచ్చు. అయితే, దీని వల్ల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వంపై 50,000 కోట్ల రూపాయల వరకు భారం పడవచ్చు. కానీ ధరలు తగ్గితే వినియోగం, టాక్స్ వసూళ్లు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
GST వసూళ్లతో ప్రభుత్వ ఖజానా పెరిగింది
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జూన్ నెలలో GST వసూళ్లలో 6.2% కంటే ఎక్కువ వృద్ధి నమోదైంది. ఇది 1.85 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ గణాంకం సుమారు 1.74 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. అయితే జూన్ నెల GST వసూళ్లు మే నెలలో 2.01 లక్షల కోట్ల రూపాయలు, ఏప్రిల్‌లో 2.37 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి.