Rule Change: జనవరి 1, 2026 నుండి కేవలం సంవత్సరం మాత్రమే మారడం లేదు. మీ రోజువారీ జీవితాన్ని, ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేసే అనేక కీలక నిబంధనలు కూడా మారుతున్నాయి. బ్యాంకింగ్, సోషల్ మీడియా, ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలకు సంబంధించి అమల్లోకి రానున్న ఆ 10 ముఖ్యమైన మార్పులు ఇవే.
జనవరి 2026 నుండి మారనున్న 10 కీలక నిబంధనలు
ఖరీదైన కార్లు
మీరు కొత్త ఏడాదిలో కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీ బడ్జెట్ పెంచుకోవాల్సిందే. దాదాపు అన్ని ప్రముఖ కంపెనీలు ధరలను పెంచుతున్నాయి.
- Honda: 1-2% పెంపు.
- Nissan: 3% పెంపు.
- MG: 2% పెంపు.
- Mercedes-Benz: 2%, BMW 3% వరకు ధరలను పెంచనున్నాయి.
సోషల్ మీడియా- ట్రాఫిక్ నిబంధనలు
ఆస్ట్రేలియా, మలేషియా తరహాలోనే భారత్‌లో కూడా 16 ఏళ్ల లోపు పిల్లల కోసం కఠినమైన సోషల్ మీడియా నిబంధనలను ప్రభుత్వం తీసుకురానుంది. అలాగే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ, నోయిడా వంటి నగరాల్లో పెట్రోల్/డీజిల్ కమర్షియల్ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించవచ్చు.
కొత్త ఐటీఆర్ ఫామ్
ఆదాయపు పన్ను శాఖ కొత్త ఐటీఆర్ ఫారమ్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇందులో మీ బ్యాంకింగ్, ఖర్చుల వివరాలు ముందుగానే నింపబడి ఉంటాయి. ఇది పన్ను చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తుంది.
Also Read: గౌతమ్ గంభీర్ ఉద్వాసనపై బీసీసీఐ స్పష్టత.. ఆ వార్తల్లో నిజం లేదు!
ఎల్‌పీజీ, ఇంధన ధరలు
ప్రతి నెలా ఒకటిన జరిగే మార్పుల్లో భాగంగా గ్యాస్ సిలిండర్ ధరలు మారనున్నాయి. జనవరి 1న గృహ అవసరాల సిలిండర్ ధర తగ్గుతుందని సామాన్యులు ఆశిస్తున్నారు. విమాన ఇంధన (ATF) ధరల్లో మార్పు వల్ల విమాన టికెట్ల ధరలు కూడా మారవచ్చు.
రైతులకు కొత్త ఐడీ
ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. PM కిసాన్ పథకం కింద నగదు పొందడానికి ఈ ఐడి తప్పనిసరి అవుతుంది. అలాగే PM ఫసల్ బీమా కింద అడవి జంతువుల వల్ల పంట నష్టపోయినా 72 గంటల్లో రిపోర్ట్ చేస్తే పరిహారం అందుతుంది.
ఆధార్-పాన్ లింకింగ్
ఆధార్-పాన్ లింక్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2025. మీరు ఆ లోపు లింక్ చేయకపోతే జనవరి 1 నుండి మీ పాన్ కార్డ్ పనిచేయదు. దీనివల్ల బ్యాంకింగ్ లావాదేవీలు, ఐటీఆర్ ఫైలింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతాయి.
8వ వేతన సంఘం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది శుభవార్త. జనవరి 1, 2026 నుండి 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు కరువు భత్యం (DA) పెరగడం వల్ల ఉద్యోగుల జీతాలు గణనీయంగా పెరుగుతాయి. హర్యానా వంటి రాష్ట్రాలు కనీస వేతనాన్ని కూడా పెంచాలని యోచిస్తున్నాయి.
క్రెడిట్ స్కోర్ అప్‌డేట్
బ్యాంకింగ్ నిబంధనల్లో పెద్ద మార్పు రానుంది. ఇప్పటివరకు 15 రోజులకు ఒకసారి అప్‌డేట్ అయ్యే క్రెడిట్ డేటా, ఇకపై ప్రతి వారం అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అప్పు ఇచ్చే సంస్థలకు కస్టమర్ల ఆర్థిక స్థితిపై మరింత స్పష్టత వస్తుంది.
రేషన్ కార్డ్ నిబంధనలు
2026 నుండి రేషన్ కార్డుల కోసం ఆన్‌లైన్ అప్లై సిస్టమ్ మరింత బలోపేతం అవుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా రేషన్ సేవలు పొందవచ్చు.
డిజిటల్ అటెండెన్స్
అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ పద్ధతిలో నమోదు చేసే ప్రక్రియ జనవరి నుండి ప్రారంభం కానుంది.
