Gold Prices సామాన్యులకు బంగారం అందని ద్రాక్షలా మారుతోంది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు ఒక్కసారిగా రాకెట్‌లా దూసుకెళ్తున్నాయి. మంగళవారం ఎంసీఎక్స్ (MCX) మార్కెట్ ప్రారంభం కావడమే భారీ లాభాలతో మొదలైంది. ఏప్రిల్ గోల్డ్ కాంట్రాక్టులు 0.5 శాతానికి పైగా పెరిగి రూ.1,56,740 మార్కును తాకాయి. వెండి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏకంగా ఒక శాతం లాభపడి కిలో వెండి ధర రూ.2,59,569 వద్ద ట్రేడ్ అవుతోంది.
బంగారం ధరలు ఈ స్థాయిలో పెరగడానికి ప్రధానంగా మూడు అంతర్జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి.
యుద్ధ మేఘాలు: పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధం ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తోంది. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి నెలకొనడంతో మదుపర్లు స్టాక్ మార్కెట్ల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకుని బంగారంలో పెడుతున్నారు.
డాలర్ బలహీనపడటం: అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో అమెరికా డాలర్ విలువ క్షీణించింది. డాలర్ బలహీనపడితే సహజంగానే బంగారం ధరలకు రెక్కలు వస్తాయి. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చినప్పుడు బంగారం కొనుగోలు మరింత ఆకర్షణీయంగా మారడంతో డిమాండ్ పెరిగింది.
యూఎస్ ఫెడ్ నిర్ణయం: అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Fed) ఈ వారం నిర్వహించనున్న కీలక సమావేశంపై మార్కెట్ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వడ్డీ రేట్ల పెంపు లేదా తగ్గింపుపై ఫెడ్ ఇచ్చే సంకేతాలు బంగారం ధరలను మరింత ప్రభావితం చేయనున్నాయి.
సామాన్యుడిపై భారం
ప్రస్తుతానికి అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5,000 డాలర్ల మార్కును దాటేసింది. ఇదే ధోరణి కొనసాగితే దేశీయ మార్కెట్‌లో త్వరలోనే 10 గ్రాముల బంగారం ధర రూ.1.60 లక్షల మార్కును చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
