Reliance Retail : భారతదేశ కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో రిలయన్స్ రిటైల్ మరో కీలక అడుగు వేసింది. వినియోగదారుల అవసరాలను తీర్చడంలో, అధిక నాణ్యత గల ఉత్పత్తులను అందించడంలో తన శక్తిని మరింత విస్తరించేందుకు దేశంలో ప్రసిద్ధిగాంచిన కెల్వినేటర్ బ్రాండ్‌ను అధికారికంగా కొనుగోలు చేసింది. ఈ కొనుగోలుతో కన్స్యూమర్ డ్యూరబుల్స్ మార్కెట్‌లో రిలయన్స్ రిటైల్ తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోనుంది.
కెల్వినేటర్ వారసత్వం
100 ఏళ్లకు పైగా విశ్వసనీయత, ఆవిష్కరణలకు పర్యాయపదంగా నిలిచిన కెల్వినేటర్, ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ రిఫ్రిజిరేషన్ పరిశ్రమలో మార్గదర్శక బ్రాండ్‌గా ప్రసిద్ధి చెందింది. 1970, 80లలో భారతదేశంలో “ది కూలెస్ట్ వన్” అనే ట్యాగ్‌లైన్‌తో ఐకానిక్ గుర్తింపును సొంతం చేసుకుంది. శాశ్వత నాణ్యత, అత్యుత్తమ పనితీరు, సాంకేతిక ప్రతిభతో కెల్వినేటర్ ఇప్పటికీ వినియోగదారుల మన్ననలు పొందుతోంది.
రిలయన్స్ రిటైల్.. కెల్వినేటర్ కలయిక
కెల్వినేటర్ బ్రాండ్ శక్తిని రిలయన్స్ రిటైల్ విస్తృత రిటైల్ నెట్‌వర్క్‌తో మిళితం చేయడం ద్వారా అధిక వినియోగదారు విలువ సృష్టించడమే కాకుండా ప్రీమియం గృహోపకరణాల మార్కెట్‌లో వేగవంతమైన విస్తరణకు ఇది దోహదపడనుంది. భారతీయ వినియోగదారుల కోసం ప్రపంచ స్థాయి ఉత్పత్తులను సులభంగా అందుబాటులోకి తెచ్చే లక్ష్యాన్ని ఈ ఒప్పందం సాధించబోతుందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇషా అంబానీ వ్యాఖ్యలు
“సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉంచడం మా ప్రధాన లక్ష్యం” అని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (RRVL) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా ఎం. అంబానీ తెలిపారు. “కెల్వినేటర్ కొనుగోలు మా ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది గ్లోబల్ ఇన్నోవేషన్‌ను మరింత విస్తృత స్థాయిలో భారతీయ వినియోగదారులకు అందించడానికి మాకు అవకాశమిస్తోంది. దీనికి మా డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, సమగ్ర సేవా సామర్థ్యాలు దృఢమైన వెన్నుదన్నుగా నిలుస్తాయి” అని ఆమె వివరించారు.
SBI Loans : పూచీకత్తు లేకుండా రూ.1 లక్ష రుణం.. అప్లై చేయండిలా..!