Reliance Power : రిలయన్స్ పవర్.. ఇది అనిల్ అంబానీకి చెందిన కంపెనీ. ఈ కంపెనీకి చెందిన షేర్ ధర వారం క్రితం వరకు చాలా తక్కువ రేంజులోనే కదలాడింది. అయితే గత నాలుగు రోజుల్లో ఈ కంపెనీ షేరు ధర దాదాపు 21.5 శాతం మేర పెరిగిపోయి రూ.36.17కు చేరింది. రిలయన్స్ పవర్ కంపెనీకి మహారాష్ట్రలోని బుటిబోరి థర్మల్ ప్లాంటును అదానీ పవర్ కొనబోతోందనే ప్రచారం వల్లే దీని ధర అంతగా పెరిగింది. ఈ విద్యుత్ ప్లాంటు సామర్థ్యం 600 మెగావాట్లు. దాదాపు రూ.2,400 కోట్ల నుంచి రూ.3వేల కోట్ల రేటుకు ఈ విద్యుత్ ప్లాంటును అదానీ పవర్ కొంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి. దీనివల్ల విద్యుత్ రంగంలో తన కంపెనీని విస్తరించాలనే అదానీ కల సులభంగా సాకారం కానుందని అంటున్నారు. మరోవైపు అదానీ పవర్ షేర్ ధర ప్రస్తుతం రూ.698.45 వద్ద కదలాడుతోంది.
We’re now on WhatsApp. Click to Join
మనదేశంలోనే అత్యంత ధనికుడు ముకేశ్ అంబానీ సోదరుడే ఈ అనిల్ అంబానీ. ఆయన ప్రస్తుతం అప్పుల ఊబిలో ఉన్నారు. అనిల్ అంబానీకి వ్యాపారాలు పెద్దగా కలిసి రాకపోవడంతో దివాలా తీశారు. కంపెనీల పేరు మీద తీసుకున్న అప్పులను బ్యాంకులకు తిరిగి కట్టలేకపోయారు. ఒకానొక దశలో తనకు మిగిలిన ఆస్తులు సున్నా అని అనిల్ అంబానీ చెప్పారు. అయితే ఇప్పుడు ఆయనకు చెందిన ఒక థర్మల్ ప్లాంటును(Reliance Power) కొనేందుకు అదానీ ముందుకొచ్చారు. దానికి ఏకంగా రూ.3వేల కోట్లు ఇచ్చేందుకు ఆయన రెడీ అయ్యారట. అంటే గతంలో వివిధ కేసుల విచారణ సందర్భంగా అనిల్ అంబానీ చెప్పినవన్నీ అబద్ధాలే అని తేలిపోయింది. బుటిబోరి థర్మల్ ప్లాంటు సామర్థ్యం 600 మెగావాట్లు. ఒక్కో మెగావాట్‌కు రూ. 5 కోట్ల దాకా రేటు ఉంటుంది. ఈ లెక్కన రేటు కట్టి ఆ ప్లాంటును కొనేందుకు అదానీ రెడీ అవుతున్నారు. అదే జరిగితే.. రిలయన్స్ పవర్ షేరు, అదానీ పవర్ షేరు ధర రెక్కలు తొడగడం ఖాయం అని స్టాక్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.