ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio) తన డైలీ డేటా (Data Plan) వోచర్ల వ్యాలిడిటీపై కీలక మార్పులను చేసింది. రూ.19, రూ.29 డేటా వోచర్లకు సంబంధించిన గడువును ప్రస్తుత ప్లాన్ వ్యాలిడిటీకి పరిమితం చేయకుండా, ప్రత్యేకంగా వోచర్ ఆధారంగా పరిమితం చేసింది. ఇప్పటివరకు రూ.19 డేటా వోచర్ ద్వారా అందిన 1 జీబీ డేటా ప్రస్తుత ప్లాన్ గడువు వరకు వాడుకునే అవకాశం ఉండేది. కానీ కొత్త మార్పుల ప్రకారం.. ఇప్పుడు ఈ 1 జీబీ డేటా కేవలం ఒక రోజుకే పరిమితం అవుతుంది. ఇదే విధంగా రూ.29 వోచర్ ద్వారా వచ్చే 2 జీబీ డేటాను రెండు రోజుల్లోనే వినియోగించుకోవాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయం అనేకమంది జియో యూజర్లను షాక్ కు గురి చేస్తుంది. ప్రత్యేకించి రోజువారీ డేటా అయిపోయినప్పుడు తక్కువ ఖర్చుతో అదనపు డేటా అవసరమైన వినియోగదారులు ఈ కొత్త నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తోంది. ఇదే సమయంలో ఇతర టెలికాం కంపెనీలతో పోటీలో ఉన్న జియో తన వినియోగదారులపై ఈ రీతిన నిబంధనలు కఠినంగా చేయడం కొంత మంది యూజర్లలో ఆందోళన కలిగిస్తోంది.
జియో తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చాలా మంది వినియోగదారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఈ మార్పులు వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. కొందరు వినియోగదారులు తమ అవసరాల ప్రకారం డేటా వోచర్లు ఉపయోగించుకోవడం కష్టమవుతుందని ఆవేదన చెందుతున్నారు. జియో తీసుకున్న ఈ చర్య వినియోగదారుల ఖర్చును పెంచే అవకాశం ఉంది. అలాగే డేటా వాడకంలో అప్రమత్తతను పాటించాల్సిన అవసరం పెరిగింది. టెలికాం రంగంలో నిత్యమూ మార్పులు జరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఈ మార్పులకు అనుగుణంగా తమ ప్లాన్లను సవరించుకోవాల్సి ఉంటుంది.
Read Also : Condoms : హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో కండోమ్ ప్యాకెట్ల బుకింగ్