RBI : ఈ ఏడాది ఇప్పటివరకు మూడు విడతలుగా వడ్డీ రేట్లపై కోతలు విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI), ఈసారి మాత్రం తూలనకూడని పరిస్థితుల్లో ఆచితూచి వ్యవహరించింది. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, ముఖ్యంగా అమెరికా ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిన టారిఫ్‌లు, వీటి ప్రభావం భారత్‌పైన పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, వడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయించింది. బుధవారం నాడు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నూతన ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రెపో రేటును 5.5 శాతం వద్దే కొనసాగించాలని ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. ఇది మార్కెట్ల అంచనాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, ద్రవ్యోల్బణం ఆశించిన స్థాయిలో తగ్గినప్పటికీ, అంతర్జాతీయ పరిస్థితులపై ఇంకా స్పష్టత లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
గత కోతలు – మూడు విడతల్లో 1 శాతం తగ్గింపు
. ఇప్పటికే 2025 సంవత్సరం ప్రారంభం నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లలో గణనీయమైన కోతలు విధించింది.
. ఫిబ్రవరిలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతానికి తీసుకెళ్లింది.
. ఏప్రిల్‌లో, మరోసారి అదే స్థాయిలో తగ్గింపుతో ఇది 5.75 శాతానికి చేరింది.
. జూన్ సమీక్షలో అయితే పెద్ద ఎత్తులో 50 బేసిస్ పాయింట్ల కోత విధించి, రెపో రేటును 5.5 శాతానికి తీసుకువచ్చారు.
. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 100 బేసిస్ పాయింట్లు (1 శాతం) వడ్డీ రేట్లు తగ్గించారు.
అంతర్జాతీయ సంక్షోభాలపై ఆర్‌బీఐ అప్రమత్తం
సంజయ్ మల్హోత్రా పేర్కొన్నట్లు, అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న వ్యాపార విధానాలు, ముఖ్యంగా ట్రంప్ టారిఫ్‌లు, ఇంకా పూర్తి స్పష్టత కలిగించలేదు. ఇవి సరుకుల ధరలపై, ముడి వస్తువుల సరఫరా పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నందున, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు వడ్డీ రేట్ల విషయంలో సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు.
స్థిర విధాన వైఖరిని కొనసాగించనున్న కమిటీ
ఈ నేపథ్యంలో వడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయిలో నిలిపివేయడమే కాక, తక్షణంగా ఎలాంటి మార్పులు చేయనని, స్థిర విధాన వైఖరిని కొనసాగించనున్నట్లు కూడా MPC స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని, అవసరమైతే భవిష్యత్తులో మార్పులు పరిశీలిస్తామని RBI తెలిపింది. ఈ ఏడాది ఇప్పటివరకు మూడు కీలక దశల్లో వడ్డీ రేట్లను తగ్గించిన RBI, ప్రస్తుతం మాత్రం వేచి చూడాలనే ధోరణితో ముందుకెళ్తోంది. ప్రపంచ ఆర్థిక పరిణామాలు, అమెరికా విధానాలపై స్పష్టత వచ్చే వరకూ, ఆర్బీఐ ధృడమైన మరియు తటస్థమైన విధానంతో వ్యవహరిస్తుందని తాజా సమీక్ష సూచిస్తోంది.
ఆర్‌బీఐ గవర్నర్ ప్రసంగంలోని కీలకాంశాలు..
. రుతుపవనాలు సమృద్ధిగా కొనసాగుతున్నందున ఆర్థిక వ్యవస్థలో నూతన ఉత్సాహం రానుంది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుండటంతో ద్రవ్యోల్బణం మరింత దిగి రానుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమివ్వనుంది.
. ప్రస్తుతం ద్రవ్యోల్బణం స్థిరంగా 4శాతం వద్దే ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ద్రవ్యోల్బణం 3.1శాతం వరకు దిగి రావచ్చని అంచనా.
. కరెంట్ ఖాతా లోటు స్థిరమైన స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది. వ్యవస్థలో ద్రవ్యలభ్యత మిగులు స్థాయిలోనే ఉంది.
. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదవ్వొచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి బలమైన ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
Read Also: Indian Fishermen : తమిళనాడుకు చెందిన 14 మంది జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ