Site icon HashtagU Telugu

RBI MPC Meet: రాఖీ పండుగకు ముందు శుభ‌వార్త చెప్ప‌నున్న ఆర్బీఐ.. ఏంటంటే?

RBI MPC Meet

RBI MPC Meet

RBI MPC Meet: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆగస్టు 4-6 మధ్య జరగనున్న మానిటరీ పాలసీ కమిటీ (RBI MPC Meet) సమావేశంలో రెపో రేటును మరోసారి తగ్గించే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నివేదిక ప్రకారం.. ఈ సమావేశంలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించవచ్చు. ఇది రాఖీ పండుగకు ముందే వినియోగదారులకు ఒక శుభవార్త కావచ్చు.

పండుగ సీజన్‌లో క్రెడిట్ వృద్ధి

ఈ వడ్డీ రేట్ల కోత పండుగ సీజన్‌కు ముందు ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుందని నివేదిక అంచనా వేస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో పండుగ సీజన్ త్వరగా మొదలవుతుంది కాబట్టి ఈ నిర్ణయం “ముందస్తు దీపావ‌ళి” కావచ్చు. గతంలో 2017 ఆగస్టులో రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గినప్పుడు దీపావళి వరకు 1,956 బిలియన్ రూపాయల క్రెడిట్ వృద్ధి కనిపించింది. అందులో దాదాపు 30 శాతం వ్యక్తిగత రుణాల విభాగం నుంచి వచ్చింది. పండుగ సమయంలో వినియోగదారుల ఖర్చు పెరగడం, వడ్డీ రేట్లు తగ్గడం వల్ల రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. దీంతో బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందించగలవు. ఇది ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహాన్ని పెంచి వృద్ధికి తోడ్పడుతుంది.

Also Read: WCL 2025 Final: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 విజేత‌గా సౌతాఫ్రికా!

ఇప్పటివరకు మూడు సార్లు కోత

2025 సంవత్సరంలో RBI ఇప్పటివరకు రెపో రేటును మూడు సార్లు తగ్గించింది. ఫిబ్రవరి- ఏప్రిల్‌లో జరిగిన MPC సమావేశాల్లో 25-25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. ఆ తర్వాత జూన్‌లో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రెపో రేటు 6 శాతం నుంచి 5.50 శాతానికి పడిపోయింది. రెపో రేటు తగ్గితే హోమ్ లోన్ వంటి రుణాల వడ్డీ రేట్లు కూడా తగ్గుతాయి. దీని వల్ల ఇళ్లు, కార్లు వంటి పెద్ద కొనుగోళ్లకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. తద్వారా ఆర్థిక వృద్ధికి మరింత ఊతం లభిస్తుంది.