ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (Ratan Naval Tata ) (86) మరణించారు. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు జన్మించారు. నాయనమ్మ నవజ్బాయ్ పెంపకంలో ఆయన పెరిగారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. రతన్ ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉన్నారు. 1961లో టాటా స్టీల్లో ఉద్యోగంలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి 1991-2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్ గా ఉన్నారు. తన నాయకత్వంలో టాటా గ్రూప్లో అనేక సంస్కరణలు చేపట్టారు.
రతన్ టాటా (Ratan Naval Tata ) మరణ వార్త యావత్ భారతీయులను కలిచివేస్తోంది. ‘నేషన్ ఫస్ట్’ అని నమ్మిన ఆయన, తన సంస్థనే కాకుండా పారిశ్రామిక రంగంలో దేశాన్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారని అంత గుర్తు చేసుకుంటున్నారు. టాటా గ్రూప్ లాభాల్లో 60-65% నిధులను దాతృత్వానికే వెచ్చించారు. లేదంటే ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ఆయన తొలి వరుసలో ఉండేవారు అని అంత మాట్లాడుకుంటున్నారు. రతన్ గొప్ప మానవతావాది అని ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అంటూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం రతన్ టాటా పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి కొలాబాలోని నివాసానికి తరలించారు. అంతకుముందు మహారాష్ట్ర CM ఏక్నాథ్ షిండే, Dy.CM దేవేంద్ర ఫడ్నవీస్ టాటా భౌతికకాయాన్ని సందర్శించారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని సీఎం షిండే ప్రకటించారు. భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం దక్షిణ ముంబైలోని NCPAలో ఉ. 10 గంటల నుంచి సా.4 గంటల వరకు ఉంచనున్నట్లు చెప్పారు.
ఇక ‘టాటా’ (Ratan Naval Tata ) ఫ్యామిలీ దేశంలోనే మొదటి స్టీల్ ప్లాంట్, ఫైవ్ స్టార్ హోటల్, పవర్ ప్లాంట్, సాఫ్ట్వేర్ కంపెనీ, కార్ల తయారీ సంస్థ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇలా ఎన్నో ప్రారంభించారు. టాటా ఫ్యామిలీ సమాజం కోసమే సంపదను సృష్టించి సమాజ శ్రేయస్సుకే వినియోగిస్తుంది. దేశానికి టాటా చేసిన సేవలను ఎప్పటికీ మరువలేం.
రూ.10వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు..
రతన్ 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎప్పుడూ దేశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. బాధ్యతలు స్వీకరించిన సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.10వేల కోట్లుగా ఉంది. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో టాటా గ్రూపును విస్తరించారు. స్టీల్, ఆటో మొబైల్ వంటి రంగాల్లో విస్తృతపరిచారు. కంపెనీ బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూ చేపట్టిన సంస్కరణలతో పదవి నుంచి దిగిపోయే సరికి రెవెన్యూను రూ. లక్ష కోట్లకు చేర్చారు.
సంక్షోభ సమయంలో నేనున్నాంటూ..
భారత్ ను వణికించిన ఘటనల్లో ముంబై ఉగ్రదాడి ఒకటి. టాటా గ్రూపునకు చెందిన తాజ్ హోటల్ ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో హోటల్ ధ్వంసమైంది. అయినప్పటికీ రతన్ టాటా ముందుండి మరింత దృఢంగా పునర్నిర్మించారు. దాడిలో గాయపడ్డ బాధితులతో పాటు హోటల్ సిబ్బందికి అండగా నిలిచి భరోసానిచ్చారు. కరోనా సమయంలోనూ తన వంతు సాయంగా రూ.1,500 కోట్ల భారీ విరాళం ప్రకటించి దాతృత్వాన్ని చాటుకున్నారు. గొప్ప వ్యాపారవేత్తగానే కాకుండా సమాజ సేవకుడిగా ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టాటా మరణం దేశానికి పూడ్చలేని నష్టాన్ని మిగిల్చిందని, అలాంటి గొప్ప వ్యక్తిని మరల చూడలేమని కామెంట్లు చేస్తున్నారు. రతనీ అసలైన ‘భారతరత్న’మని కొనియాడుతున్నారు.
రతన్ టాటా అందుకున్న పురస్కారాలు
రతన్ టాటా తన జీవిత కాలంలో స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోనూ అనేక గౌరవ పురస్కారాలను అందుకున్నారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఓరియంటల్ రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే మెడల్, అంతర్జాతీయ విశిష్ఠ సాఫల్య పురస్కారం, ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ గ్రాండ్ ఆఫీసర్ అవార్డు, నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్(UK), ఓస్లో బిజినెస్ ఫర్ పీస్ అవార్డు వంటి అవార్డులు, అనేక డాక్టరేట్లు తన ఖాతాలో ఉన్నాయి.
రతన్ టాటా(Ratan Naval Tata ) విజయాలివే..
అనుభవలేమితో కెరీర్ ప్రారంభంలో రతన్ టాటా అనేక విమర్శలను ఎదుర్కొన్నారు. వాటినే సోపానాలుగా మలుచుకొని ఛైర్మన్ అయ్యాక తనదైన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా టాటా గ్రూప్ను విస్తరించారు. లండన్ టెట్లీ టీ కొనుగోలు, కార్ల తయారీ సంస్థలు జాగ్వార్, ల్యాండ్ రోవర్తో పాటు కోరస్ స్టీల్ను టాటాలో భాగం చేశారు. దీంతో పాటు ఐటీ, టెలి కమ్యూనికేషన్స్, ఆటో మొబైల్స్ రంగాల్లోనూ సంస్థను విస్తృతం చేసి సక్సెస్ అయ్యారు.
రతన్ టాటా (Ratan Naval Tata ) చివరి పోస్ట్ ఇదే..
ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన లాస్ట్ పోస్ట్ వైరలవుతోంది. 3 రోజుల క్రితం తన ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేయొద్దని ట్విటర్ వేదికగా ఆయన ప్రకటన చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తన గురించి ఆలోచిస్తున్నందుకు ధన్య వాదాలు తెలిపారు. దురదృష్టవశాత్తు పోస్ట్ చేసిన మూడు రోజులకే ఆయన చనిపోయారు.
టాటా (Ratan Naval Tata ) మరణం పట్ల సంతాపం
రతన్ టాటా మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని వ్యాపారవేత్తలు హర్ష గోయెంకా, ఆనంద్ మహీంద్రా, గౌతమ్ ఆదానీ ట్వీట్లు చేశారు. టాటా ఇకపై లేరన్న విషయాన్ని తాను స్వీకరించలేకపోతున్నానని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దేశం దిశను పునర్నిర్వచించిన గొప్ప వ్యక్తిని భారత్ కోల్పోయిందని అదానీ ట్వీట్ చేశారు. వ్యాపార ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన టాటా ఇక లేరని హర్ష గోయెంకా పేర్కొన్నారు. చిత్తశుద్ధి, నిజాయితీతో ప్రపంచంపై ముద్ర వేసిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. పరిశ్రమల అభివృద్ధి, సమాజ సేవలో ఆయన భాగస్వామ్యం తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. టాటా మరణంతో ఇండస్ట్రీ ఐకాన్ను కోల్పోయిందని, ఆయనలాగా ఇంకెవ్వరూ ఉండరని టీజీ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. వాణిజ్య రంగానికి రతన్ టాటా ఆదర్శమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాసుకొచ్చారు. కేంద్రమంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, పియూష్ గోయల్ సంతాపం తెలియజేశారు. ఇండియా ఇండస్ట్రీకి రతన్ టాటా టైటాన్ అని రాజ్నాథ్ ట్వీట్ చేశారు. టాటా నిజమైన దేశభక్తుడని అమిత్ షా పేర్కొన్నారు. పరిశ్రమలకు రతన్ చేసిన కృషి మన దేశంతో పాటు ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందని నడ్డా తెలిపారు. రతన్ కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు.
Read Also : India vs Sri Lanka: శ్రీలంకపై భారత్ ఘన విజయం.. 82 పరుగుల తేడాతో గెలుపు!