Provident Fund Withdrawals: కార్మిక భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు ఒక శుభవార్త. కేంద్ర ప్రభుత్వం త్వరలో దీపావళికి ముందు ఏటీఎంల నుంచి పీఎఫ్ డబ్బును విత్‌డ్రా (Provident Fund Withdrawals) చేసుకునే సదుపాయాన్ని కల్పించనుంది. చాలా కాలంగా దీనిపై చర్చ జరుగుతోంది. కార్మిక, ఉపాధి మంత్రి మన్‌సుఖ్ మాండవియా అధ్యక్షతన అక్టోబర్ 10-11 తేదీల్లో దీనిపై ఒక సమావేశం జరగనుంది. అయితే తుది ఎజెండా ఇంకా నిర్ణయించబడలేదు.
ఈటీ నివేదిక ప్రకారం.. దీపావళికి ముందు దాదాపు 8 కోట్ల మంది EPFO సభ్యులకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని వల్ల వారు తమ ఖర్చులను మరింత మెరుగ్గా నిర్వహించుకోగలరని నివేదిక పేర్కొంది.
ట్రేడ్ యూనియన్ల డిమాండ్లపై కూడా చర్చ
EPFO వచ్చే నెలలో జరగనున్న సమావేశంలో EPFO 3.0 గురించి చర్చించనుంది. దీని ముఖ్య ఉద్దేశ్యం బ్యాంకు తరహా సదుపాయాలను ప్రారంభించడం. ఇందులో భాగంగా ఏటీఎంలు లేదా యూపీఐ లావాదేవీల ద్వారా భవిష్య నిధి నుంచి కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ట్రేడ్ యూనియన్లు చేస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని కనీస పెన్షన్‌ను నెలకు రూ.1,000 నుంచి రూ.1,500 – రూ.2,500 మధ్య పెంచే ప్రతిపాదనను కూడా ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.
Also Read: IND vs PAK: భారత్- పాక్ మ్యాచ్.. తీవ్రంగా శ్రమిస్తున్న ఇరు జట్లు!
EPFO 3.0 వల్ల లాభాలు
EPFO 3.0 వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ప్రారంభించడంలోని ప్రధాన ఉద్దేశ్యం పీఎఫ్ సేవలను పూర్తిగా డిజిటల్ చేయడమే. తద్వారా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడం లేదా క్లెయిమ్ చేయడం వంటివి సభ్యులకు సులభం అవుతుంది. వాస్తవానికి, ఇది ఈ ఏడాది జూన్‌లోనే ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక పరీక్షల కారణంగా ఆలస్యమైంది.
EPFO 3.0 కింద, మీరు ఏటీఎంల నుంచి మాత్రమే కాకుండా, గూగుల్ పే, ఫోన్‌పే లేదా పేటీఎం వంటి యాప్‌ల ద్వారా కూడా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోగలుగుతారు. అంటే ఇకపై చిన్న చిన్న మార్పుల కోసం లేదా పీఎఫ్ క్లెయిమ్ కోసం పీఎఫ్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంటి వద్ద నుంచే ఈ పనులను సులభంగా పూర్తి చేయవచ్చు. దీని ద్వారా మీరు మీ పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, కాంట్రిబ్యూషన్‌లను కూడా ట్రాక్ చేయవచ్చు. ఈ కొత్త వ్యవస్థలో EPFO సభ్యులకు ఏటీఎం కార్డు లాంటి ఒక కార్డును జారీ చేస్తుంది. ఈ కార్డు పీఎఫ్ అకౌంట్‌తో అనుసంధానమై ఉంటుంది. దీని ద్వారా మీరు ఏటీఎం నుంచి సులభంగా పీఎఫ్ డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా డబ్బును విత్‌డ్రా చేయాలంటే పీఎఫ్ అకౌంట్‌ను యూపీఐకి లింక్ చేయాల్సి ఉంటుంది.