Hindustan Unilever : ప్రస్తుతం వ్యాపార ప్రపంచంలో ప్రియా నాయర్ పేరు మారుమోగుతోంది. భారత్‌లో ప్రముఖ ఎఫెఎంసిజి సంస్థ హిందూస్థాన్ యూనీలీవర్ (HUL) తన తదుపరి సీఈవోగా ఆమెను నియమించిందనే వార్త, కార్పొరేట్ రంగంలో సంచలనంగా మారింది. 92 ఏళ్ల చరిత్ర కలిగిన హెచ్‌యూఎల్‌లో మొదటిసారి ఒక మహిళ సీఈవో పదవిని చేపట్టనుండటం గర్వకారణం. జూలై 31తో ప్రస్తుత సీఈవో రోహిత్ జావా పదవీకాలం ముగియగా, ఆగస్టు 1న ప్రియా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రియా నాయర్ ఈ స్థాయికి రావడం అనేది నిశితమైన కృషి, విశాలమైన విజన్‌కు ఫలితం. యూనీలీవర్ లీడర్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (ULE) సభ్యురాలిగా కొనసాగుతున్న ఆమె, తాజాగా హెచ్‌యూఎల్ బోర్డులో కూడా స్థానం దక్కించుకున్నారు. ప్రస్తుతం యూనీలీవర్‌లో బ్యూటీ అండ్ వెల్‌బీయింగ్ విభాగానికి ప్రెసిడెంట్‌గా ఉన్న ప్రియా, ఈ కొత్త బాధ్యతలతో మరింత గౌరవాన్నీ, బాధ్యతనూ చేర్చుకున్నారు.
Read Also: Maharashtra : వైరల్ వీడియోల కోసం ప్రాణాలతో చెలగాటం..300 అడుగుల లోయలో పడిన కారు
1995లో ప్రియా నాయర్ హెచ్‌యూఎల్‌లో చేరినప్పుడు, ఎవ్వరూ ఊహించలేదు ఆమె ఒక రోజు ఈ సంస్థను నడిపించే స్థాయికి చేరతారని. అప్పటినుండి ఇప్పటివరకు, ఆమె హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్, కన్జూమర్ ఇన్‌సైట్స్ వంటి విభాగాల్లో కీలక పాత్రలు నిర్వహించారు. డోవ్, రిన్, కంఫర్ట్ వంటి ప్రధాన బ్రాండ్‌లకు బ్రాండ్ మేనేజర్‌గా పని చేశారు. ప్రత్యేకించి లాండ్రీ బిజినెస్‌ను విజయవంతంగా నడిపారు. అంతేకాదు, ఓరల్ కేర్, డియోడరెంట్స్, కస్టమర్ డెవలప్‌మెంట్ విభాగాలను కూడా సమర్థంగా నిర్వహించారు. ఈ ప్రయాణమంతా మహిళలందరికీ ఓ ప్రేరణ. ఎఫ్‌ఎంసిజి రంగంలో మహిళలు అధిక స్థానాల్లోకి రావడం అరుదైనదే. ప్రియా నాయర్ మాత్రం తన మెరుగైన నాయకత్వంతో ఈ దిశగా కొత్త మార్గాన్ని చూపిస్తున్నారు.
ప్రియా నాయర్ విద్యార్హతలు ఆమె విజయానికి గట్టి పునాది వేశాయి. ముంబయిలోని సిడెన్‌హామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి బీకామ్ పూర్తి చేశారు. అనంతరం పూణేలోని ప్రముఖ సింబయాసిస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్లో మార్కెటింగ్‌లో ఎంబీఏ చేశారు. ఈ మేరకు ఆమెకు మార్కెటింగ్ రంగంపై విశేషమైన అవగాహన ఏర్పడింది. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో “ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్‌మెంట్”ను పూర్తి చేయడం ద్వారా, గ్లోబల్ వ్యాపార పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నారు. ఈ శిక్షణ ఆమెను గ్లోబల్ లీడర్‌గా తీర్చిదిద్దింది. ప్రియా నాయర్ నాయకత్వంలో హెచ్‌యూఎల్‌కు కొత్త దిశ, కొత్త దృష్టి లభించనుంది. సుసంపన్నమైన అనుభవం, మార్కెట్‌కు అనుగుణంగా మారే దృక్కోణం, వినియోగదారుల మానసికతపై లోతైన అవగాహన – ఇవన్నీ ఆమెను ఉత్తమ సీఈవోగా నిలబెట్టనున్నాయి. ప్రియా నాయర్ కథ ఓ సాధారణ ఉద్యోగిని నుంచి సంస్థ సీఈవో స్థాయికి ఎదగాలంటే ఎంత అంకితభావం, నైపుణ్యం అవసరమో చాటి చెప్పే కథ. ఆమె విజయం మహిళలకు మాత్రమే కాదు, ప్రతి యువతికి ఆదర్శంగా నిలుస్తుంది.
Read Also: Balochistan: పాకిస్థాన్‌లో బస్సుపై భారీ దాడి.. 9 మంది దుర్మరణం!