Trump India : డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భారత్‌లోని ఆయన వ్యాపారాలకు అకస్మాత్తుగా రెక్కలు వచ్చాయి. రాకెట్ వేగంతో వాటి విస్తరణ ముందుకు సాగుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలోని పూణే, ముంబైలలో రెండు ట్రంప్ టవర్ల నిర్మాణం పూర్తయింది. గురుగ్రామ్, కోల్‌కతా నగరాల్లో మరో రెండు ట్రంప్ టవర్లు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. మన దేశంలో మరో 4 ట్రంప్ టవర్లను నిర్మించాలనే ప్లాన్‌తో డొనాల్డ్ ట్రంప్ కంపెనీ అడుగులు వేస్తోంది.
కొత్త అప్‌డేట్స్ ఏమిటంటే.. ట్రంప్ టవర్స్ తరఫున ట్రిబెకా డెవలపర్స్(Trump India) అనే కంపెనీ మన ఇండియాలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ట్రంప్ అమెరికా ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. ఈ కంపెనీ పూణే, గురుగ్రామ్, నోయిడా, ముంబై, హైదరాబాద్, బెంగళూరులలో మొత్తం 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు కొత్త రియల్ ఎస్టేట్ ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటి విలువ దాదాపు రూ. 15వేల కోట్లు ఉంటుందని అంచనా. అమెరికా తర్వాత ట్రంప్ గ్రూప్‌కు ఎక్కువ రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రాజెక్టులు ఉన్నది మన ఇండియాలోనే. అధికారిక సమాచారం ప్రకారం ఇండియాలో ట్రంప్ గ్రూపునకు నాలుగు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి విస్తీర్ణం 30 లక్షల చదరపు అడుగులు.
Also Read :Kasthuri Shankar : పరారీలో నటి కస్తూరి.. ఫోన్ స్విచ్చాఫ్.. ఇంటికి తాళం
త్వరలోనే ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లలోకి ట్రంప్ టవర్స్ ఎంటర్ కానుంది. పూణే, ముంబై, గురుగ్రామ్‌లలో అదనంగా కొత్త ప్రాజెక్టులను చేపట్టనుంది. ఈవివరాలను స్వయంగా ట్రిబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేశ్ మెహతా వెల్లడించారు. డిసెంబర్ ప్రారంభంలోగా నాలుగు ఒప్పందాలపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక భాగస్వాములు, భూమి యజమానుల సాయంతో ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తామన్నారు. ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌లో పర్యటిస్తారని తెలిపారు. భారత్‌లో చేపట్టబోయే కొత్త ట్రంప్ టవర్ ప్రాజెక్టులను వారు స్వయంగా ప్రారంభిస్తారని వెల్లడించారు. ‘‘పూణేలో ఆఫీసు డెవలప్‌మెంట్ ప్రాజెక్టును ట్రంప్ టవర్స్ చేపట్టబోతోంది. దీనిపై డిసెంబరులో ప్రకటన చేసి.. 2025 మార్చి నుంచి మే మధ్యకాలంలో పనులను ప్రారంభిస్తాం. ట్రంప్ టవర్స్ త్వరలో భారత్‌లో చేపట్టనున్న ఆరు ప్రాజెక్టులలో ఒకటి గోల్ఫ్ క్లబ్ ప్రాజెక్టు, మరొకటి విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది’’ అని ఆయన వివరించారు.