Passport Rule: భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్‌లో (Passport Rule) భర్త లేదా భార్య పేరును జోడించడానికి లేదా మార్చడానికి వివాహ ధృవీకరణ పత్రం (మ్యారేజ్ సర్టిఫికెట్) తప్పనిసరి అవసరాన్ని తొలగించింది. దీని స్థానంలో అనెక్సర్-జే నియమాన్ని అమలు చేసింది. ఈ కొత్త నియమం ప్రకారం ఇప్పుడు పాస్‌పోర్ట్‌లో భర్త లేదా భార్య పేరును జోడించడానికి ఒక అఫిడవిట్ సమర్పించాలి.
జాయింట్ ఫోటోతో అఫిడవిట్ సమర్పణ
ఈ నియమం ప్రకారం.. భర్త-భార్య ఇద్దరూ కలిసి ఒక జాయింట్ ఫోటోతో అఫిడవిట్ సమర్పించడం ద్వారా పేరును జోడించవచ్చు. అంటే పాస్‌పోర్ట్‌లో జీవిత భాగస్వామి పేరును జోడించడానికి ఇకపై వివాహ ధృవీకరణ పత్రం అవసరం లేదు. జాయింట్ ఫోటో, అఫిడవిట్ సమర్పిస్తే చాలు. దీనిపై భర్త-భార్య ఇద్దరి సంతకాలు ఉండాలి.
గతంలో పాస్‌పోర్ట్‌లో జీవిత భాగస్వామి పేరును జోడించడానికి సుదీర్ఘమైన ప్రక్రియను అనుసరించాల్సి ఉండేది. వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా సమర్పించాల్సి వచ్చేది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగం కోసం లేదా ఇతర కారణాల వల్ల విదేశాలకు వెళ్లాల్సిన వారికి సమస్యలు ఎదురయ్యేవి. కానీ ఇప్పుడు ఈ సమస్యలు ఉండవు.
అనెక్సర్-జే నియమం వివరాలు
విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం అనెక్సర్-జే నియమం అమలులోకి వచ్చింది. దీని కింద భర్త-భార్య ఇద్దరూ తమ వివాహ ఫోటో లేదా ఇటీవలి జాయింట్ ఫోటోను అప్‌లోడ్ చేయాలి. అవసరమైన ఫారమ్‌ను పూరించాలి. దీనిపై ఇద్దరి జాయింట్ సంతకాలు ఉండాలి. అవసరమైన సమాచారాన్ని అందించాలి. ఈ పత్రాలను వివాహ ధృవీకరణ పత్రంగా పరిగణించి, పాస్‌పోర్ట్‌లో భర్త లేదా భార్య పేరును జోడిస్తారు.
Also Read: UPI: ఫోన్ పే, గూగుల్ పే నుంచి వేరొకరికి డబ్బు పంపించారా? అయితే టెన్షన్ వద్దు!
పాస్‌పోర్ట్ ఫీజు, ప్రక్రియ:
- ఫీజు: సాధారణ పాస్‌పోర్ట్ కోసం ₹1,500 నుంచి ₹2,000 వరకు ఫీజు చెల్లించాలి. తత్కాల పాస్‌పోర్ట్ కోసం అదనపు ఫీజు చెల్లించాలి.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: పాస్‌పోర్ట్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేయాలి. దీని కోసం https://portal2.passportindia.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.
ప్రక్రియ
- న్యూ యూజర్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పేజీకి వెళ్లండి.
- రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, Passport Seva వెబ్‌సైట్‌కు వెళ్లండి.
- పాస్‌పోర్ట్ తీసుకోవాలనుకున్న నగరంలోని పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని ఎంచుకోండి.
- అవసరమైన వివరాలను పూరించి, Register బటన్‌పై క్లిక్ చేయండి.