UPI Transactions: దేశంలో అత్యంత వేగంగా ప్రజాదరణ పొందుతున్న యూపీఐ లావాదేవీల (UPI Transactions)పై జీఎస్‌టీ (వస్తువులు, సేవల పన్ను) విధించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా రూ. 2000 మించిన లావాదేవీలపై జీఎస్‌టీ విధించబడుతుందనే వార్తలను ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో తోసిపుచ్చింది. మాన్సూన్ సెషన్ సందర్భంగా జూలై 22న ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఈ విషయాన్ని వెల్లడించారు.
జీఎస్‌టీ విధించాలనే సిఫారసు లేదు
యూపీఐ లావాదేవీలపై జీఎస్‌టీ గురించి ప్రభుత్వం ఆలోచనలపై ఒక ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. “రూ. 2000 మించిన లావాదేవీలపై జీఎస్‌టీ విధించాలని జీఎస్‌టీ కౌన్సిల్ ఎటువంటి సిఫారసు చేయలేదు” అని స్పష్టం చేశారు. జీఎస్‌టీ కౌన్సిల్ అనేది రాష్ట్రాలు, కేంద్రం రెండింటి సభ్యులను కలిగి ఉన్న ఒక రాజ్యాంగ సంస్థ అని, జీఎస్‌టీ రేట్లు, మినహాయింపులపై నిర్ణయాలు దాని సిఫారసుల ఆధారంగానే తీసుకోబడతాయని ఆయన వివరించారు.
Also Read: Top-5 Languages: భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే టాప్-5 భాషలు ఇవే.. తెలుగు స్థానం ఎంతంటే?!
కర్ణాటకలో జీఎస్‌టీ నోటీసులతో కలకలం
యూపీఐ లావాదేవీలపై జీఎస్‌టీ వ్యవహారం ఇటీవల కర్ణాటకలో చోటు చేసుకున్న ఒక సంఘటనతో వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలో యూపీఐ లావాదేవీల డేటా ఆధారంగా వ్యాపారులకు సుమారు 6000 జీఎస్‌టీ నోటీసులు జారీ చేయబడ్డాయి. ఇది వ్యాపారుల మధ్య తీవ్ర కలకలం సృష్టించింది. వ్యాపారుల సంఘం ఈ నోటీసులకు వ్యతిరేకంగా సమ్మెకు దిగుతామని కూడా హెచ్చరించింది.
అయితే, ఆదాయపన్ను అధికారులు ఈ చర్యను చట్ట ప్రకారం సరైనదిగా అభివర్ణించారు. కమర్షియల్ టాక్స్ జాయింట్ కమిషనర్ మీరా సురేష్ పండిత్ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడుతూ.. సేవా రంగంలో లావాదేవీ పరిమితి రూ. 20 లక్షలు, వస్తువుల కోసం రూ. 40 లక్షల పరిమితిని దాటినప్పుడు జీఎస్‌టీ చట్టం ప్రకారం తమ వ్యాపారాన్ని రిజిస్టర్ చేయడం తప్పనిసరి అవుతుందని తెలిపారు. అంతేకాకుండా తమ టర్నోవర్‌ను కూడా ప్రకటించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.