Economic Survey 2026 ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఎకనామిక్ సర్వేను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే బంగారం గురించి కూడా ప్రస్తావించారు. ధరలు ఎందుకు పెరుగుతున్నాయో వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గురించి వెల్లడించారు.
2026, ఫిబ్రవరి 1న (ఆదివారం) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర వార్షిక బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. దీనికి ముందుగా ఈ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. జనవరి 29న (గురువారం) 2025-26 ఆర్థిక సర్వేను (ఎకనామిక్ సర్వే) నిర్మలా సీతారామన్ తొలుత లోక్‌సభలో, తర్వాత రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ప్రతిసారీ కేంద్ర బడ్జెట్‌కు ముందు.. ఆర్థిక సర్వే ను ప్రవేశపెట్టడం సంప్రదాయంగా వస్తోంది. ఇక్కడ గత ఆర్థిక సంవత్సరం కాలంలో దేశ ఆర్థిక పనితీరు గురించి వివరిస్తూ.. రాబోయే సంవత్సరంలో ఆర్థికంగా ఎదురయ్యే సవాళ్లను అంచనా వేసేదే ఆర్థిక సర్వే. ఆర్థిక వ్యవహారాల శాఖకు చెందిన ఎకనామిక్ డివిజన్ ఈ సర్వేను రూపొందిస్తుంది. ఇప్పుడు ఆర్థిక సర్వేలో నిర్మలా సీతారామన్.. బంగారం ధరలు , భారత ఆర్థిక వ్యవస్థలో బంగారం ప్రాముఖ్యత గురించి కూడా ప్రస్తావించారు.
ఆర్థిక సర్వే ప్రకారం.. భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ అనిశ్చితి నుంచి రక్షించడంలో బంగారం కీలక పాత్ర పోషస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భయాందోళనల నేపథ్యంలో.. ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో.. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ రేటు 2607 డాలర్ల నుంచి 5100 డాలర్లకుపైగా పెరిi. దీంతో భారత్.. తన విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను భారీగా పెంచుకుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపతకను కూడా పెంచిందని ఆర్థిక సర్వే పేర్కొంది. భారతీయులకు బంగారంపై మక్కువ కేవలం ఆభరణాలకే పరిమితం కాలేదని.. దేశ ఆర్థిక వ్యవస్థకు, ఆర్థిక భద్రతకు రక్షణ కవచంగా ఉందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. అంటే ఇక్కడ అనిశ్చితి నేపథ్యంలో.. భారత్ తన దగ్గర ఉన్న బంగారు నిల్వల ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోగలుగుతుంది.
నిర్మలా సీతారామన్ ఇతర కీలక అంశాల గురించి వివరించారు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ అనిశ్చితి కారణంగానే బంగారం, వెండి ధరలు అధిక స్థాయిలో కొనసాగుతాయని సర్వేలో చెప్పారు. 24 క్యారెట్ల బంగారం ధర దేశీయంగా 10 గ్రాములకు రూ. 1,78,850 కి చేరినట్లు తెలిపారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలోనే.. బంగారం ఇప్పుడు పెట్టుబడిదారులకు సురక్షిత స్వర్గధామంగా (సేవ్ హెవెన్ ఇన్వెస్ట్‌మెంట్ అసెట్) నిలిచిందని.. దీని వల్ల పెట్టుబడిదారుల నుంచి డిమాండ్ పెరిగిందని పేర్కొన్నారు.
భారత్.. తన విదేశీ మారక నిల్వల్ని వైవిధ్యపరచడంలో బంగారం వాటాను ఇటీవలి కాలంలో పెంచుకుంది. 2025 మార్చి నాటికి భారత్ (ఆర్బీఐ) వద్ద బంగారం నిల్వల విలువ 78.2 బిలియన్ డాలర్లుగా ఉండగా.. ఇప్పుడు 2026 జనవరి నాటికి 117.5 బిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపారు నిర్మలా సీతారామన్. ఇది భారత కరెన్సీలో చూస్తే విలువ రూ. 12 లక్షల కోట్లకుపైగానే ఉంటుంది. రికార్డుల ప్రకారం.. ఆర్బీఐ దగ్గర ప్రస్తుతం 880 టన్నులకుపైగా బంగారం నిల్వలు ఉన్నాయి. ఆర్బీఐ ఈ క్రమంలో తన దగ్గర ఉన్న విదేశీ కరెన్సీని తగ్గించుకొని.. బంగారం నిల్వల్ని పెంచుకోవడం ద్వారా డాలర్‌పై ఆధారపడటం తగ్గించుకునే దిశగా పయనిస్తోంది.
ఇంకా బంగారం ధరలు భారీగా పెరగడంతో.. బంగారంపై లోన్లు గత సంవత్సరంతో పోలిస్తే 125.3 శాతం మేర పెరిగినట్లు నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేలో భాగంగా చెప్పారు. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నప్పటికీ.. దేశంలో పెట్టుబడి డిమాండ్ బలంగా ఉండటంతో దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయని.. ఇది వాణిజ్య లోటుపై ప్రభావం చూపుతుందని వెల్లడించారు.
