New UPI Rules: దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే ఆగస్టు 1, 2025 నుండి UPI నిబంధనలలో కొన్ని మార్పులు రానున్నాయి. ఈ మార్పులను (UPI New UPI Rules) వినియోగదారులందరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ముఖ్య మార్పులు, వాటి ప్రభావం
బ్యాలెన్స్ చెకింగ్‌పై పరిమితి: ఆగస్టు 1 నుండి ఒక రోజులో UPI యాప్ ద్వారా 50 సార్లకు మించి మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేయలేరు. ఈ నిబంధన వ్యాపారుల నుంచి బ్యాంకులు, వినియోగదారుల వరకు అందరికీ వర్తిస్తుంది.
ఆటో-పే లావాదేవీలకు నిర్దిష్ట సమయాలు: బిల్ పేమెంట్లు, EMIలు, సబ్‌స్క్రిప్షన్‌లు వంటి ఆటో-పే లావాదేవీలు ఇప్పుడు నిర్దిష్ట స్లాట్‌లలో మాత్రమే జరుగుతాయి. నివేదికల ప్రకారం.. ఈ సమయాలు సాధారణంగా ఉదయం 10 గంటలకు ముందు లేదా మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఉంటాయి. రాత్రి 9:30 గంటల తర్వాత కూడా స్లాట్ ఫిక్స్ చేయబడవచ్చు. లావాదేవీలు వేగంగా జరిగేలా.. సిస్టమ్‌పై లోడ్ తగ్గించేందుకు ఈ మార్పులు చేస్తున్నారు.
Also Read: Khaleel Ahmed: ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన భారత ఫాస్ట్ బౌలర్!
విఫలమైన లావాదేవీల స్థితి తనిఖీ: ఒకవేళ ఏదైనా లావాదేవీ విఫలమైతే మీరు రోజులో మూడు సార్లు మాత్రమే దాని స్థితిని చూడగలరు. దీని కోసం ప్రతిసారీ కనీసం 90 సెకన్ల గ్యాప్ ఉండాలి.
ఈ కొత్త నిబంధనలు Google Pay, PhonePe, Paytm వంటి అన్ని UPI వినియోగదారులకు వర్తిస్తాయి. ఈ ఏడాది మార్చి- ఏప్రిల్ నెలల్లో సిస్టమ్ డౌన్ అయిన రెండు పెద్ద సంఘటనలు జరిగాయి. దీని వల్ల లక్షలాది వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. అటువంటి సమస్యలను నివారించేందుకు ఈ మార్పులు దోహదపడతాయని భావిస్తున్నారు.
సాధారణ వినియోగదారులపై ప్రభావం?
UPI నిబంధనల్లో ఈ మార్పుల వల్ల సామాన్య వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండదు. వారు ఇంతకు ముందులాగే రోజువారీ బిల్లు చెల్లింపులు, ఇతర చెల్లింపులు లేదా బదిలీలు చేస్తూనే ఉంటారు. లావాదేవీ పరిమితులలో ఎలాంటి మార్పు లేదు. ఇంతకు ముందులాగే ఒక రోజులో ఒక లక్ష రూపాయల వరకు లావాదేవీలు చేయగలరు. విద్య లేదా ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన చెల్లింపుల కోసం ఐదు లక్షల రూపాయల వరకు పరిమితి ఉంది.