. పెట్రోల్ బంక్‌లోనే కార్ సర్వీసింగ్ సౌకర్యం
. విస్తృత నెట్‌వర్క్‌తో సేవల విస్తరణ
. కస్టమర్ సౌకర్యమే ప్రధాన లక్ష్యం
Maruti Suzuki: దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా ఉన్న మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) తన వినియోగదారులకు మరింత దగ్గరగా సేవలను అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)తో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుని దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐఓసీఎల్ ఫ్యూయల్ రిటైల్ అవుట్‌లెట్లలో మారుతి కార్ల సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఈ భాగస్వామ్యం ఆటోమొబైల్ రంగంలో సేవల విస్తరణకు కొత్త దారులు తెరుస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం, వినియోగదారులు తరచుగా వెళ్లే ఐఓసీఎల్ పెట్రోల్ బంకులలోనే మారుతి సుజుకీ కార్లకు అవసరమైన సర్వీసింగ్ సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ నిర్వహణ పనులు, చిన్నచిన్న మరమ్మతులు మాత్రమే కాకుండా, అవసరమైన ఇతర ప్రధాన సేవలను కూడా ఈ కేంద్రాల్లో పొందవచ్చని కంపెనీ స్పష్టం చేసింది. ఇంధనం నింపించుకునే సమయంలోనే కార్ సర్వీసింగ్ కూడా చేయించుకునే వీలుండటంతో వినియోగదారుల సమయం శ్రమ రెండూ ఆదా కానున్నాయి. ముఖ్యంగా పట్టణాలు, హైవేలపై ప్రయాణించే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది.
మహారత్న హోదా కలిగిన ఐఓసీఎల్‌కు దేశవ్యాప్తంగా సుమారు 41,000 ఫ్యూయల్ స్టేషన్ల విస్తృత నెట్‌వర్క్ ఉంది. ఈ అపారమైన మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని మారుతి సుజుకీ తన సేవలను మరింత విస్తృతంగా అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే మారుతి సుజుకీ దేశంలోని 2,882 నగరాల్లో 5,780 సర్వీస్ టచ్‌పాయింట్లతో బలమైన సర్వీస్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఐఓసీఎల్‌తో భాగస్వామ్యం ద్వారా ఈ నెట్‌వర్క్ మరింత బలోపేతం అవుతూ, కొత్త ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకోగలుగుతుంది.
ఈ సందర్భంగా మారుతి సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సర్వీస్) రామ్ సురేష్ ఆకెళ్ల మాట్లాడుతూ..కస్టమర్లకు కార్ సర్వీసింగ్ అనుభవాన్ని అత్యంత సులభంగా సౌకర్యవంతంగా మార్చడమే మా ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ఇండియన్ ఆయిల్ వంటి విశాలమైన నెట్‌వర్క్ ఉన్న సంస్థతో కలిసి పనిచేయడం ఎంతో ప్రయోజనకరం అని తెలిపారు. అలాగే, ఐఓసీఎల్ డైరెక్టర్ (మార్కెటింగ్) సౌమిత్రా పి. శ్రీవాస్తవ మాట్లాడుతూ..మా ఇంధన సేవలతో పాటు, నాణ్యమైన ఆటోమోటివ్ నిర్వహణ సేవలను కూడా అందించగలగడం ఆనందంగా ఉంది. ఇది వినియోగదారులకు ఒక సమగ్ర అనుభవాన్ని ఇస్తుంది అని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా మారుతి సుజుకీ ఐఓసీఎల్ కలిసి వినియోగదారుల అవసరాలను మరింత మెరుగుగా తీర్చే దిశగా ముందడుగు వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సర్వీస్ కేంద్రాలు ఎంతమేరకు విస్తరిస్తాయో కస్టమర్ల స్పందన ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారనుంది.
