Jio Insurance : రిలయన్స్ ఇండస్ట్రీస్.. మూడు పువ్వులు ఆరుకాయలు అన్న చందంగా తన వ్యాపారాలను వివిధ రంగాలకు శరవేగంగా విస్తరిస్తోంది. ఈక్రమంలో మరో రంగంపై రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ఫైనాన్షియల్ సర్వీసు ఇప్పుడు ఫోకస్ పెట్టింది. ఆ రంగమే.. ఇన్సూరెన్స్. దేశంలో విప్లవాత్మక రీతిలో బీమా వ్యాపారాన్ని చేసేందుకు జియో సిద్ధం చేస్తున్న ప్లాన్ గురించి ఈ వార్తలో తెలుసుకుందాం..
Also Read :WhatsApp : వాట్సాప్ లింక్డ్ డివైజ్‌లలో ఇక సరికొత్త ఫీచర్
అలయంజ్ ఎస్‌ఈ.. ఇది జర్మనీ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించే ఇన్సూరెన్స్(Jio Insurance) కంపెనీ. ఈ కంపెనీ 2001 సంవత్సరం నుంచి మనదేశంలో బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీతో కలిసి బజాజ్ అలయంజ్ బీమా పథకాలను విక్రయిస్తోంది. బజాజ్, అలయంజ్ ఎస్ఈలు కలిసి బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ అనే రెండు సంయుక్త సంస్థలను(జేవీ) నడుపుతున్నాయి. జేవీ అంటే జాయింట్ వెంచర్ కంపెనీ. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీల్లో ఒకటిగా అలయంజ్ ఎస్ఈకి మంచి పేరుంది. బజాజ్‌తో కలిసి ఏర్పాటు చేసిన రెండు జేవీల నుంచి త్వరలోనే వైదొలగాలని అలయంజ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలయంజ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం.. జియో అని తెలుస్తోంది. జియో ఫైనాన్షియల్ సర్వీసుతో కలిసి సరికొత్త ఇన్సూరెన్స్ జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేసే ఉద్దేశంతోనే బజాజ్‌కు గుడ్ బై చెప్పాలని అలయంజ్ నిర్ణయించుకుందని అంటున్నారు.
Also Read :Bangladesh Protests : దేశాధ్యక్షుడి భవనంలోకి నిరసనకారులు.. బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత
బజాజ్ అలయంజ్ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లలో అలయంజ్ ఎస్‌ఈకి చెరో 26 శాతం మేర వాటాలు ఉన్నాయి. ఈ రెండు కంపెనీల్లో బజాజ్‌కు చెరో 74 శాతం వాటా ఉంది.తమ జేవీ కంపెనీల నుంచి అలయంజ్ వైదొలగబోతోందనే సమాచారాన్ని బజాజ్ ఇప్పటికే స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. తాము మాత్రం బీమా వ్యాపారాల్లో కంటిన్యూ అవుతామని స్పష్టం చేసింది. మరోవైపు జియోతో కలిసి జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ విభాగాల్లో రెండు వేర్వేరు జాయింట్ వెంచర్ కంపెనీలను ఏర్పాటు చేసే అంశంపై అలయంజ్ ఎస్ఈ చర్చలు జరుపుతోంది. అయితే దీనిపై ఈ కంపెనీలు ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం జియో ఫైనాన్షియల్‌కు నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ప్రముఖ బ్యాంకర్ కె.వి.కామత్ వ్యవహరిస్తున్నారు. ఆయనకు బ్యాంకింగ్, బీమా రంగాల్లో చాలా అనుభవం ఉంది. దాని ద్వారా జియోను బీమా రంగంలో విస్తరించాలని ముకేష్ అంబానీ లక్ష్యంగా పెట్టుకున్నారు.